వర్షాలు…కరెంటుతో జాగ్రత్త

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు కరెంటు స్తంబాలు, వైర్లతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ ఏ గోపాలరావు హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లోకి వెళ్లే రైతులు విద్యుత్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కరెంటుతో ప్రతి ఒక్కరు తప్పని సరిగా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. తడి చేతులతో ఇంట్లో విద్యుత్‌ పరికరాలు, తీగలను ముట్టుకోవద్దనీ, బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్‌ వైర్లు తాకకుండా చూసుకోవాలన్నారు. చిన్న పిల్లలు భవనాల పైకి వెళ్ళకుండా చూడాలని, విద్యుత్‌ తీగలకు తగిలి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని హెచ్చరించారు. సెల్‌ ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి మాట్లాడకూడదనీ, 3 పిన్‌ ప్లగ్‌తో నాణ్యమైన చార్జర్లను వాడాలని సూచించారు. ఎవరైనా విద్యుద్ఘాతానికి గురైతే, ఆతృతతో ఆ వ్యక్తిని ముట్టుకోరాదనీ, కర్ర, ప్లాస్టిక్‌ వస్తువులతో ఆ వ్యక్తిని వేరు చెయ్యాలని చెప్పారు. సొంత రిపేర్లు చేయోద్దనీ, రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరికి వెళ్లొద్దనీ, స్టార్టర్‌ డబ్బాలు నీటిలో తడవకుండా చూసుకోవాలని తెలిపారు. ఇలలాంటి జాగ్రత్తలతో కరెంటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విద్యుత్‌ పర్యవేక్షణ కోసం ఫోన్‌ నంబర్లు 9440811244, 9440811245, టోల్‌ ఫ్రీ నెంబరు. 1800 425 0028 కు లేదా 1912 కు ఫోన్‌ చేయాలని తెలిపారు.