గీతన్నలకు మొండి చెయ్యి

– జీవో నెం 5లో వృత్తి పేరు.. మెమోలో తొలగింపు
– తొమ్మిదేండ్లుగా అందని సాయం
–  వృత్తిదారులపై చిన్నచూపు
– సాయం చేయాలని మంత్రి హరీశ్‌రావుకు వినతి
బీసీ కుల వృత్తులు, చేతి వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకంలో కల్లుగీత వృత్తిదారుల్ని విస్మరించారు. 15 రకాల వృత్తుల్ని చేర్చిన ప్రభుత్వం కల్లుగీత వృత్తిదారుల్ని మాత్రం పక్కన పెట్టింది. బీసీ కులాల్లోని గొర్రెల పెంపకందార్లకు గొర్రెల పంపిణీ పథకం, చేనేత వృత్తిదారులకు కొన్ని పథకాలు, మత్స్యకారులకు ఉచిత చేపపిల్లల పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. తమను విస్మరించడంపై కల్లుగీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
బీసీ కులాల్లో కల్లుగీత వృత్తిపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. నిత్యం ప్రమాదపుటంచుల్లోకి వెళ్లి వచ్చే గీతన్నల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విమర్శ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత చెట్లు కోటికిపైనే కల్లు పారుతున్నాయి. 4,558 గీత కార్మిక సహకార సంఘాలు, 3,717 వ్యక్తిగత లైసెన్స్‌ కల్గిన టీఎఫ్‌టీల ద్వారా 2.50 లక్షల మంది కల్లుగీత కార్మికులు లైసెన్స్‌లు కలిగి ఉన్నారు. లక్షలాది మంది లైసెన్స్‌ లేకుండా సీజనల్‌గా కల్లుగీసే వృత్తిని చేస్తున్నారు. మగవారు కల్లుగీసే పనిలో ఉంటే మహిళలు కల్లును విక్రయించే పని చేస్తుంటారు. అంటే సుమారు రాష్ట్రంలో 6 లక్షలకుపైగానే కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని కల్లుగీత కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
కల్లుగీత వృత్తిదారులకు నిరాశ
లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకంలో కల్లుగీత వృత్తిదారులకు చోటు లభించలేదు. బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయాల్ని పూర్తి సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయంగా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘం విధి విధానాల్ని రూపొందించి ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 5ను జారీ చేసింది. ఇందులో బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు సంబంధిన శాఖలను చేర్చారు. ఆ జాబితాలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కల్లుగీత కార్మిక కో అపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరు కూడా చేర్చారు. అంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే వృత్తుల్లో కల్లుగీత కూడా ఉందని అందులో పేర్కొన్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కల్లుగీత కార్మికులు తమకూ లక్ష ఆర్థిక సాయం అందుతుందని ఆశపడ్డారు. వారి ఆశ ఒక్కరోజుతోనే ఆవిరైంది. మరోసటి రోజే అంటే 7వ తేదీన 1480/డీ/2023 నెంబర్‌ పేరిట మెమో జారీ చేశారు. ఆ మెమోలో మాత్రం ముందు జారీ చేసిన జీవోలో పేర్కొన్న కల్లుగీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ పేరు లేదు. దాంతో కల్లుగీత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. నేపథ్యంలో సంగారెడ్డి పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి హారీశ్‌రావును కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పేరుకే పెఢరేషన్‌.. నిధుల్లేవు
బీసీ కుల వృత్తుల్లో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం మొదట్లో గీత పారిశ్రామిక ఆర్థిక సహకార సంస్థ ఉండేది. బడ్జెట్‌ కేటాయించి కల్లుగీత వృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించేది.
గతంలో కల్లుగీత కార్మికులకు గీత పారిశ్రామిక ఆర్థిక సహకార సంస్థ ఉండేది. దాన్ని తొలగించి బీసీ కార్పొరేషన్‌ పరిధిలోని 10 ఫెడరేషన్లలో భాగంగా ఉన్న కల్లు గీత కార్మిక కో అపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో చేర్చారు. తొమ్మిదేండ్లుగా కల్లుగీత కార్మికులకు ఆర్థిక పరిపుష్టిని అందించే ఏ పథకమూ అమలు చేయలేదు. చేనేత, గొర్రెల పెంపకందార్లు, మత్స్యకారులు, గీత కార్మికులకు స్వతంత్రంగా సంస్థలున్నాయి. వీటిల్లో గొర్రెల పెంపకందార్లకు సబ్సిడీ గొర్రెల పంపిణీ చేశారు. చేనేత కార్మికులకు వివిధ రకాల పథకాలు అమలవుతున్నాయి. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పథకం అమలవుతుంది. కానీ..! కల్లుగీత వృత్తిదారులకు మాత్రం ఆర్థిక సహాయం అందించే పథకాలేవీ అమలుకాలేదని అంటున్నారు. నీరా పథకం వ్యక్తిగతంగా ఉపయోగపడదని చెబుతున్నారు. కనీసం లక్ష రూపాయల సాయం కూడా అందకపోవడంతో కల్లుగీత కార్మికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
గీత వృత్తిదారులకూ లక్ష ఇవ్వాలి: రమేష్‌ గౌడ్‌, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి
బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఇవ్వనున్న లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని కల్లుగీత కార్మికులకు కూడా ఇవ్వాలి. జీవోలో టాడీటాఫర్స్‌ పేరు చేర్చిన ప్రభుత్వం మరుసటి రోజు మెమోలో తొలగించడం గీత కార్మికులకు అన్యాయం చేయడమే. అన్ని వృత్తులకు ఏదో రూపంలో సాయం చేస్తున్న ప్రభుత్వం కల్లుగీత వృత్తిదారులకు కూడా ఆర్థిక సహాయం అందించాలి. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లాం. విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. గీత వృత్తిదారులకూ లక్ష సాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.