బెగ్గింగ్‌ మాఫియా గుట్టురట్టు

– వృద్ధులు, చిన్నారులతో భిక్షాటన
– జల్సాలు చేస్తున్న ప్రధాన నిందితులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ మాఫియా గుట్టురట్టయింది. జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌, కేబీఆర్‌ పార్క్‌ వద్ద భిక్షం ఎత్తుకుంటున్న మొత్తం 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో ఆ పని చేయిస్తున్న వారిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన అనిల్‌ పవార్‌ బెగ్గింగ్‌ మాఫియాకు తెరతీశాడు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన అనిల్‌ సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. మరికొంత మందితో కలిసి గ్రూపుగా ఏర్పాడ్డాడు. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులను, ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకుని వారికి మాయమాటలు చెప్పి పలు చౌరస్తాల్లో భిక్షాటన చేయిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్క్‌తోపాటు వివిధ కూడళ్లలో కలెక్షన్‌ పాయింట్లుగా ఎంచుకున్నారు. ప్రతి రోజూ వారి నుంచి రూ.4500 – రూ.6వేల వరకు సంపాదిస్తున్నారు. భిక్షాటన చేసే వారికి మాత్రం రోజుకు రూ.200 ఇస్తున్నారు. వచ్చిన డబ్బులతో నిందితులు జల్సాలు చేస్తున్నారు.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు బెగ్గింగ్‌ మాఫియాను అరెస్టు చేశారు. భిక్షాటన చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో ప్రివెన్షన్‌ ఆఫ్‌ బెగ్గింగ్‌ యాక్ట్‌ కింద అనిల్‌ పవార్‌పై కేసు పెట్టి అరెస్టు చేశారు.
భిక్షాటన చేస్తున్న 18 మంది నకిలీ ట్రాన్స్‌జెండర్‌ల అరెస్ట్‌
నగరంలోని పలు సిగళ్ల వద్ద భిక్షాటన చేస్తూ వాహనాదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న నకిలీ ట్రాన్స్‌జెండర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మహంకాళి, బోయిన్‌పల్లి మారేడ్‌పల్లి, రాంగోపాల్‌ పేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 18 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.