వ్యాపారం రంగంలో అన్నో ఆటుపోట్లు. వాటిని అధిగమించి ప్రయాణం చేయాలంటే ఎన్నో హార్డిల్స్ దాటుకు రావాలి. పెరుగుతున్న ఆధునికత. కొత్త కొత్త దారులు. ప్రపంచమే చిన్నదై గుప్పిట్లోకి వచ్చేసింది. వ్యాపార రంగంలోనూ పెను మార్పులు. ఎల్లలు దాటి ప్రపంచంలో ఏ మారు మూలకైనా ఇ-కామర్స్ చేరుకునే సదుపాయం! అలాంటి అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా గ్లోబల్ సర్వీసెస్ అందించే సంస్థ ‘నిర్యతి’. దాని సహ వ్యవస్థాపకురాలు అమృత తివారి. ఉన్నత విద్యావంతురాలు, వ్యాపార రంగంలో సునిశిత పరిశీలనా దృష్టి, గమ్యం చేరుకోవాలనే లక్ష్యం, పట్టుదతో ఈ రంగంలో అడుగుపెట్టిన ఆమెతో సంభాషణ…
మీరు వ్యాపార రంగాన్నే ఎంచుకోవటానికి కారణం ఏంటి?
నేను చదివింది బిజినెస్ మేనేజ్మెంట్. ఆ రంగం అంటే నాకు ఎంతో ఇష్టం. నా భర్త దిబ్యెందు గంగూలి (నిర్యతి సీఈఓ, కో ఫౌండర్) కూడా వ్యాపార వేత్త. దాంతో ఆయనతో కలిసి పని చేస్తూ వ్యాపారంలో ఎన్నో మెలుకువలు, అనుభవాలు, పాఠాలు నేర్చుకున్నాను. అ అనుభవాలతోనే ఈ రంగం ఎంచుకున్నాను. కానీ మేము ముందు మొదలు పెట్టిన వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. వ్యాపార రీత్యా కొన్ని ఈ కంపెనీల సమావేశాలకి హాజరు అవుతున్నప్పుడే నేనూ ఏదో ఒకరోజు మా సొంత బ్రాండ్‌తో బిజినెస్ చేయాలని అనుకున్నాను. నాకు ఇంకా గుర్తే ఆ రోజుల్లో లెదర్ వస్తువుల కోసం బెంగుళూర్ నుంచి అంబర్ ప్రయాణం చేయటం. అప్పటి నుండి ఉపయోగకరమైన వస్తువుల మీద, వ్యాపారంలో నిలదొక్కుకునే వాటిమీద దృష్టి సారించాను. ఎప్పుడూ మా ఇంట్లో బిజినెస్‌కి సంబంధించిన సంభాషణలు జరుపుతూనే ఉండేవి. ఈ అన్ని అనుభవాలతో ‘నిర్యతి’ ప్రారంభించాము. నిర్యాతి అనేది సంస్కృత పదం. నిర్యత్ (ఎగుమతి) నుండి తీసుకుని పెట్టాము.
వ్యాపారం మొదలుపెట్టి ఎంతకాలం అయ్యింది?
మా వారు స్థాపించిన స్టార్టప్ కంపెనీ కష్టాలలో ఉన్నప్పుడు అంటే 2020 చివరలో నేను కూడా ఈ వ్యాపార రంగంలో ప్రవేశించాను. ఐఐయమ్ ఎన్‌ఎస్‌ఆర్‌సీఎల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌తో 5 వారాల బూట్‌క్యాంప్ కోసం నా వ్యాపార ఆలోచనను అమలు పరిచే అవకాశం నాకు లభించింది. అ అనుభవంతో నా మొదటి ప్రోటోటైప్‌ను మొదలుపెట్టాను. ఇది పర్యావరణ (ఎకో) ఉత్పత్తుల కోసం ప్రారంభించిన ”గ్లోబల్ సప్లరు చైన్” ఆన్ లైన్ మార్కెట్. 2021లో నా బిజినెస్‌కు గురించి మరింత లోతుగా తెలుసుకున్నాను. అలా జైపూర్‌లోని బనస్థలి విద్యాపీఠ్‌లో ఇంక్యుబేషన్ కోర్స్ చేసే అవకాశం వచ్చింది. మహిళలకు అత్యంత ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలలో ఇది ఒకటి. నేను ఆ సమయంలో గుర్గావ్‌లో ఉన్నాను. రెండోసారి కోవిడ్ వేవ్ లాక్ డౌన్‌లు వున్న రోజులవి. ఆ సమయలో నిర్యతి గురించి మరించ ఆలోచించడానికి సమయం దొరికింది. 2022లో ఇ-కామర్స్ చుట్టూ ఎదురయ్యే ఎన్నో సమస్యల నుండి బయట పడటానికి ఇ-కామర్స్ బిజినెస్‌లో పదిహేడేండ్ల అనుభవం వున్న మా వారి సహకారం నాకెంతో ఉపయోగపడింది. ఆ సమయంలో భారతదేశంలో తయారయ్యే అనేక బి2బి బ్రాండ్స్ ఎగుమతి కోసం రెడీగా వున్నాయి. అప్పుడు నేను వాటిపై దృష్టి పెట్టి, గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశించాలనుకున్నాను. తర్వాత ఇద్దరం కలిసి ఈ ప్రయాణం మొదలు పెట్టాం. వి హబ్ వారిని కూడా అనేక మార్లు కలిశాను. వారితో చర్చలు జరిపాను. 2023లో మా ఆలోచనను అమలు పరచటానికి తగిన సమయం వచ్చింది. గ్లోబల్ సప్లరు చైన్ 4పిఎల్ మొదలు పెట్టాము. తొలి అడుగులు వేస్తున్నాము. చేరాల్సిన గమ్యం దూరంగానే వుంది.
ఒక బిజినెస్ ఉమెన్‌గా మీరు ఎదుర్కున్న సమస్యలు?
ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కున్నాను. 2021లో చాలా మంది ఇన్వెస్టర్స్ కో ఫౌండర్‌గా మగవారు ఉంటే మంచిదన్నారు. ఎలాగో మా వారిని ఒప్పించాను. సమస్య తీరిందనుకుంటే కొంతమంది కుటుంబంలోని వ్యక్తి కో – ఫౌండర్‌గా వుంటే ఇన్వెస్ట్ చేయము అనేవారు. అప్పటికే మాకున్న వనరులన్నీ తెచ్చి బిజినెస్‌లో పెట్టాము. ఏడాది కష్ట పడ్డాకా మాకు రావలసిన రెవెన్యూ వాయిదా పడింది. దానితో మేము పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ కూడా తరిగిపోవటం మొదలయింది. మార్కెట్‌కి కొత్తవాళ్ళం కావడంతో కస్టమర్స్ కూడా చాలా తక్కువ ధరకు మా సర్వేసేస్‌ని ఉపయోగించుకో సాగారు. బిజినెస్‌లో వచ్చే సమస్యలు స్త్రీలకైనా పురుషులకైనా ఒకటే అని నమ్ముతాను. ప్రతి ఒక్కరికీ తొలి అడుగు ఒకేలా వుంటుంది. ఎదురయ్యే సమస్యలు ఎలాగైనా దాటుకుంటూ ముందుకు సాగాలి.
ఒక మహిళ వ్యాపార రంగంలో వుంటే చాలా మంది నిరుత్సాహ పరుస్తుంటారు. దీనిపై మీ అభిప్రాయం?
ముందు మనం ఆ పాతకాలపు ఆలోచనల నుండి బయట పడాలి. ప్రపంచం మారి పోయింది. మహిళలకు సపోర్ట్ చేసే వ్యవస్థ వుంది. వారి ఆలోచనా ధోరణిని అభివృద్ధి పరిచే ఎన్నో అవకాశాలు వున్నాయి. బిజినెస్‌లోకి అడుగు పెట్టే వారు ఎంచుకున్న రంగాన్ని బాగా పరిశీలించాలి. టీంగా ఏర్పడాలి, ఆ రంగం లోని నిపుణుల సలహా తీసుకోవాలి. ఎంటర్ ప్రేన్యుర్ షిప్ అనేది పూల పాన్పు కాదు. చాలా కఠినమైనది. ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలలో చాలా సార్లు విఫలం అవుతారు. అవన్నీ అనుభవాలే.
ఒక మహిళగా మహిళా సాధికారతపై మీ అభిప్రాయం?
నేను మహిళా సాధికారతను నమ్ముతాను. చాలా కాలం నుంచి ఆ విషయంపై మాట్లాడుతున్నాను. మహిళలు తమకున్న శక్తి తోనూ, పొజిషన్ని బట్టి సాధికారతను సాధించగలరని నమ్ముతాను. ఒక మహిళా తప్పకుండా అనుకున్నది సాధించగలదు. మా సంస్థలో తొంభై శాతం మహిళలే వున్నారు. నేను వారి జీవితంలో ఒక ప్రభావాన్ని సృష్టిస్తే వారు వారి కుటుంబాలపై ప్రభావాన్ని చూపిస్తారు. అందువల్ల పాజిటివ్ వేవ్స్ సమాజం చుట్టూ వుండి సామాజిక శ్రేయస్సుపై పడి అనుకూల ఫలితాలు వస్తాయి.
బిజినెస్ రంగంలో మీ అనుభవం…?
ఈ అనుభవం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. త్యాగాలు చేయవలసి వస్తుంది. ఈ స్థాయికి చేరుకోవటానికి చాలా సంతోషంగా వుంది. కానీ ఇక్కడి వరకు రావటానికి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాను. వ్యాపారం చేసి అభివృద్ధిలోకి రావాలంటే ఏ ప్రాంతమైనా రాష్ట్రమైనా దేశమైనా సరే ఎంచుకోవాలి. బిజినెస్ ప్రపంచం చాలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఎన్నో కుటుంబాల కలలను తీరుస్తుంది.
మీరు ఎంచుకున్న బిజినెస్‌లో గ్లోబల్ చైన్ 4పీఎల్ గురించి వివరిస్తారా?
మేము 4పీఎల్ గ్లోబల్ చైన్ సప్లరు చేస్తాము. తయారీ దారులు ప్రపంచంలో ఏ మారుమూలనైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. మా ద్వారా తమ ఉత్పత్తులను వివిధ ప్రదేశాలకి చేరవేసీ బిజినెస్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో వుండే ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌తో బ్రాండ్‌లను ఆక్సెస్ చేస్తాము. మా హెడ్ క్వార్తర్స్ సింగపూరులో వుంది. మా బాక్ ఆఫీస్ ఆపరేషన్ మాత్రం ఇండియాలోనే వుంది. యుయస్‌ఏ, దుబారులో కూడా మా వ్యాపార సంస్థలు ఉన్నాయి. గ్లోబల్‌గా ప్రతి దేశంలోనూ చివరి మైలు రాయి వరకూ మేము మా సేవలను అందిస్తాము. ఎన్నో వ్యాపార ఉత్పత్తులను 25 పైగా గ్లోబల్ ఆన్లైన్ సర్వీసెస్‌ని e-distribution ద్వారా మా సేవలను అందిస్తాము. మేము మా MVP (MinimumViable Market) కంపేనీని టెక్నాలజీ ద్వారా పనిచేస్తున్నాము. చిన్న వ్యాపారస్తులకు చైన్ సాఫ్ట్ వేర్‌ని అందించాలనుకుంటున్నాము. మా గ్లోబల్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ద్వారా ఉన్నతమైన, ప్రామాణికమైన ఉత్పత్తులను మన భారతదేశం నుంచి 190కిపైగా దేశాలకు రవాణా చేస్తాము. ఉత్పత్తి తయారీ దారులతో కూడా కాంటాక్ట్‌తో ఉండటం ద్వారా భవిష్యత్‌లో భారతీయ వీూవీజు తయారీ దారులకు కూడా సహాయం చేస్తాము.
ఉమెన్ ఎంటర్ ప్రేన్యుర్ హబ్ గురించి మీ అభిప్రాయం?
మహిళలకు చక్కటి మద్దతు ఇచ్చే సంస్థ. మా బిజినెస్ మార్కెట్‌లోకి వెళ్ళడానికి కూడా వి హబ్ సహకారం ఎంతో ఉంది. మేము అనుకున్న ఎకోసిస్టంకి చేరుకున్నాము. ఉదాహరణకి వ్యాపార సంస్థలకి చేరుకునే అవకాశం, గ్లోబల్‌గా వున్న ఎన్నో సంస్థలతో కనెక్ట్ అవటం వంటి మొదలైన వాటికి అవకాశం వుంటుంది. ఇలాంటి సంస్థలని చేరుకోవాలంటే ఎంతో సమయం కూడా పడుతుంది.
ఈ రంగంలోకి రావాలనుకునే మహిళలకు మీరిచ్చే సలహా?
ముందుగా మహిళలు తమ మీద నమ్మకం వుంచుకుని, అసాధారణమైన విజయాలు సాధిస్తాము అనే విశ్వాసంతో ముందడుగు వేయాలి. తాము ఎంచుకున్న అంశంపై పరిశోధనలు చేయాలి. మార్కెటింగ్, అమ్మకాల వ్యూహాలు అర్ధం చేసుకోవాలి. ఎంచుకున్న వ్యాపారం మార్కెట్‌లో ఫిట్ అవుతుందో లేదో తెలుసుకోండి. విఫలం అయితే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులని ఒప్పించండి. ఇంటివారి మద్దతు తప్పనిసరి. మీ ప్రారంభం ఇంటి నుంచే కావాలి. కానీ ఇందులో ఊహించని రిస్క్ కూడా వుంటుంది. అందుకే ముందుగా బాగా పరిశోధన చేయండి. మొదట్లో లాభ నష్టాలు వుంటాయి. ధనాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అధైర్య పడకుండా లాభాలు కనిపించేవరకు వ్యాపారాన్ని కొనసాగించాలి. తొందర పడకండి. ‘సైమన్ సినిక్’ అమూల్యమైన వాక్యం ‘అంతులేని అలుపెరుగని ఆటగాడిగా అవ్వాలి” అనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆటలో ఓడిపోయినా ఆడుతూనే వుండాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
– మణినాథ్ కోపల్లె, 9703044410