
– మతం పేరుతో ప్రజలను విడగొట్టే రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే భగత్ సింగ్ కు అర్పించే నిజమైన నివాళి
– బి. ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
నవతెలంగాణ – కంటేశ్వర్
23 ఏళ్ల వయసులోనే బ్రిటీష్ సామ్రాజ్యవాదుల దాస్య శృంఖలాల నుండి భారతదేశం విముక్తి కోసం చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు వారి పోరాట చరిత్రను కనుమరుగు చేసి మతం పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయ అధికారాన్ని కొనసాగించాలని చూస్తున్న బీజేపీని గద్దె దింపడమే భగత్ సింగ్,రాజ గురు ,సుఖ దేవ్ లకు అర్పించే నిజమైన నివాళి అవుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారంనిజామాబాద్ జిల్లా, మోస్రా మండలం, గోవూరు గ్రామంలో జరిగిన వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ ప్రభుత్వం జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నాయకుల జీవిత చరిత్ర పాఠ్యాంశాల నుండి తొలగించటానికి కుట్ర చేస్తున్నదని, అందులో భాగంగానే కర్ణాటక ప్రభుత్వం భగత్ సింగ్ పాఠ్యాంశాన్ని తొలగించిందన్నారు. బ్రిటిష్ సామ్రాజవాదుల చేతిలో నుండి పోరాడి సాధించుకున్న దేశ సంపద, అడవులు, నదులు, ప్రభుత్వ రంగ సంస్థలైన విమానాశ్రయాలు,రైల్వేలు,ఎల్ఐసి,బీమా, రోడ్లు వంటి వాటిని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అప్పగించిందని, రైతుల చేతిలో ఉన్న సాగు భూములను అప్పగించడం కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేసిందన్నారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను హరించి వేస్తుందన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తీసివేస్తామని బహిరంగంగానే ప్రకటన చేయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ముస్లింలకు తప్ప మిగతా వారికి మత ప్రాతి పాదిక మీద పౌరసత్వం ఇవ్వడానికి సి ఏ చట్టాన్ని తెచ్చింది అన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక తత్వానికి పెను ప్రమాదం ఏర్పడిందన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే అంశం అన్నారు. మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని ఎత్తివేసే ప్రమాదం ఉంది అన్నారు. రాజ్యాంగం స్థానంలో మన ధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెడతామని ఆర్ఎస్ఎస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. కుల మత భావజాలాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో బీజేపీని అధికారంలో నుండి గద్దె దింపడానికి ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నది. 70% గా ఉన్న ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికులు ఓటు వేస్తేనే ఈ ప్రభుత్వాలు ఎన్నికవుతున్నాయి అన్న సంగతి మరిచిపోయి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తూ ఓటిసి గెలిపించిన శ్రామిక జనాన్ని దొంగలుగా చూస్తున్న వైనం బీజేపీ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అందుకోసం మళ్లీ బీజేపీ ప్రభుత్వం గెలిస్తే ఉపాధి హామీ పథకాన్ని కచ్చితంగా ఎత్తివేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని ఈ ప్రభుత్వాన్ని పారదోలటం కోసం భగత్ సింగ్ స్ఫూర్తిని తీసుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న, వ్యవసాయ కూలీలంతా వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేసి, భవిష్యత్తులో సమస్యలు పరిష్కారం మరియు ఉపాధి హామీ చట్టం కాపాడుకోవడం కోసం అనేక పోరాటాలు చేయాల్సి ఉంటుందని సూచించారు. జిల్లా అధ్యక్షులు ఏషాల గంగాధర్, సీఐటీయూ జిల్లా నాయకులు నన్నే సాహెబ్, సంఘం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మి, నాగుల గోవర్ధన్, జి శంకర్, బొర్రా గంగాధర్, బొర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.