భారత్‌ జోడోయాత్ర-2

Bharat Jodoyatra-2న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ రెండో విడత భారత్‌ జోడో యాత్రకు సిద్ధమయ్యారు . అక్టోబర్‌ 2న గాంధీ జయంతి నాడు రెండో విడత యాత్ర మొదలుకానుంది. గుజరాత్‌లోని పోరుబందర్‌ నుంచి మేఘాలయా వరకు ఈ యాత్ర కొనసాగనుంది. 2024 జనవరిలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర రెండో విడత యాత్ర ముగియనుంది. అలాగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా విస్త్రత స్థాయిలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. తొలిదశ యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు దాదాపు 4 వేల కిలోమీటర్లు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో నడిచారు. గత ఏడాది సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర 3,970 కిలో మీటర్లు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్‌ చేసి 130 రోజులకు పైగా కొనసాగిన తర్వాత జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. భారత్‌ జోడో యాత్ర ముగిసిన రెండు నెలలకే రాహుల్‌ గాంధీ.. ‘మోడీ’ ఇంటిపేరు వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో పాటు రెండేండ్ల పాటు జైలు శిక్ష పడింది. దీంతో లోక్‌ సభ ఎంపీ పదవికి కూడా అనర్హత వేటు పడింది. అయితే గత వారం సుప్రీంకోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించడంతో తిరిగి లోక్‌ సభ ఎంపీగా కొనసాగుతున్న విషయం విదితమే.