– రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరాటౌన్
దేశం ఆకలి తీర్చిన హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు భారత రత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఆదివారం వైరా బోడేపూడి భవనంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ జరిగింది. తొలుత స్వామినాథన్ చిత్రపటానికి బొంతు రాంబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో బొంతు రాంబాబు, సైన్స్ ఉద్యమ నాయకులు మల్లెంపాటి వీరభద్రం మాట్లాడుతూ స్వాతంత్య్రం ముందు దేశంలో బెంగాల్, ఇతర రాష్ట్రాలలో వచ్చిన భయంకరమైన కరువుతో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, దాని ప్రభావంతో వైద్య విద్య వైపు నుంచి జన్యు శాస్త్రం వైపు పరిశోధనలు స్వామినాథన్ ప్రారంభించారని, ఆకలితో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఆహార భద్రత కోసం హరిత విప్లవ విజయవంతం చేసిన భారత వ్యవసాయ యుగ కర్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అన్నారు. దిగుమతులు నుంచి ఎగుమతులు దిశగా భారత వ్యవసాయ అభివద్ధికి బాటలు వేసిన మహౌన్నత వ్యక్తి స్వామినాథన్ అన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం భూసంస్కరణలు, బ్యాంకులు జాతీయకరణ చేపట్టడంలో స్వామినాథన్ అలోచన ప్రభావం ఉందని, జాతీయ వ్యవసాయ కమీషన్ చైర్మన్ గా స్వామినాథన్ సిఫార్సులు రైతాంగంకు జీవం పోసిన ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం కల్పి మద్దతు ధర నిర్ణయం చేయాలనే సూచన నేటికీ బిజెపి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. గత ఇరవై సంవత్సరాలుగా భారత వ్యవసాయ పరిశోధనకు నిధులు కేటాయింపు లేకపోవడం వలన కార్పొరేట్ కంపెనీల విత్తనాలు, పురుగు మందులు పైన ఆధారపడి వ్యవసాయం కొనసాగుతోంది అన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయడం కోసం, భారత వ్యవసాయ స్వాతంత్ర పరిశోధన వ్యవస్థ పరిరక్షణ కోసం జరిగే రైతు ఉద్యమం స్వామినాథన్ గౌరవమైన నివాళి అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి, తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొంతు సమత, మాజీ సర్పంచ్ పారుపల్లి కృష్ణారావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మందడపు రామారావు, బెజవాడ వీరభద్రం, సంక్రాంతి నర్సయ్య, సంక్రాంతి పురుషోత్తం, గుమ్మా నరిసింహరావు, పైడిపల్లి సాంబశివరావు, నారికొండ అమరేంద్ర, కామినేని రవి, చిత్తారు మురళి, పారుపల్లి శ్రీనాధ్, ఎస్.డి పాషా, పాల్గొన్నారు.