కూరగాయలు తరిగినప్పుడు ఆ చెక్కును పడేస్తుంటాం. మిగిలిన కూరగాయల సంగతి ఎలా ఉన్నా గానీ ఈసారి బీరకాయ పొట్టును మాత్రం పడేయకండి.. ఎందుకంటే బీరకాయే కాదు, బీర పొట్టుతోనూ నోరూరించే వంటలు చేసి ఇంటిల్లిపాదికీ వడ్డించొచ్చు. ఇలాంటివి ప్రయత్నిస్తే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. మరెందుకు ఆలస్యం బీరపొట్టుతో ఏమేమి వంటలు చేయొచ్చొ ఓ సారి ప్రయత్నిద్దామా…!
పచ్చడి
కావాల్సిన పదార్థాలు : మినప్పప్పు, తెల్లనువ్వులు – పావుకప్పు చొప్పున, బీరపొట్టు – కప్పు, జీలకర్ర – చెంచా, చింతపండు – కొద్దిగా, బెల్లం – చిన్నముక్క, ఉప్పు – సరిపడా, నూనె – చెంచా, ఎండుమిర్చి – ఐదారు.
తయారు చేసే విధానం : చింతపండును నీళ్లల్లో నానబెట్టుకుని రసం తీసి పెట్టుకోవాలి. తెల్ల నువ్వుల్ని నూనెలేకుండా వేయించుకుని తీసుకోవాలి. కడాయిలో చెంచా నూనె వేడి చేసి బీరపొట్టును వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనెను వేసి ఎండుమిర్చి, జీలకర్రా, మినప్పప్పును వేయించుకోవాలి. వేయించిన బీరపొట్టును మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. అందులో వేయించుకున్న తాలింపూ, బెల్లం, తగినంత ఉప్పూ, నువ్వులూ, చింతపండు రసం వేసుకుని పచ్చడిలా రుబ్బుకోవాలి. కావాలనుకుంటే పచ్చడంతా తయారయ్యాక మినప్పప్పూ, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు కూడా కలుపుకోవచ్చు.
వడలు
కావాల్సిన పదార్థాలు : బియ్యం – అరకప్పు, మినప్పప్పు, శెనగపప్పు – చెంచా చొప్పున, కరివేపాకు – పది ఆకులు, పచ్చిమిర్చి – ఐదు లేదా ఆరు, బీరపొట్టు – కప్పు, జీలకర్ర- చెంచా, అల్లం – పెద్ద ముక్క, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : రెండు గంటల ముందు బియ్యాన్ని నానబెట్టు కోవాలి. కడాయిలో చెంచా నూనె వేడిచేసి ముందు గా మినప్పప్పు, శెనగపప్పు వేయించుకుని తీసుకోవాలి. తర్వాత బీరపొట్టును కూడా పచ్చివాసన పోయేదాకా సన్న మంట మీద వేయించుకుని విడిగా తీసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు కూడా నూనెలో వేయించుకుని తీసుకోవాలి. నానిన బియ్యం, శెనగపప్పు, మినప్పప్పు మిక్సీలో వేసుకుని నీళ్లు చల్లుకుంటూ మెత్తగా, గట్టి పిండిలా రుబ్బుకోవాలి. తర్వాత బీరపొట్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, జీలకర్ర, అల్లంముక్కలు మెత్తగా రుబ్బుకుని బియ్యప్పిండిలో కలపాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఈ మిశ్రమాన్ని వడల్లా అద్ది అందులో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసుకుంటే సరిపోతుంది. ఇవి వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.
ఇన్‌స్టంట్ చిప్స్
కావాల్సిన పదార్థాలు : బీరపొట్టు మూడు – నాలుగు కప్పులు (మందంగా వచ్చేలా చెక్కు తీసుకుని ముక్కల్లా చేసుకోవాలి. వీటిని రెండు రోజుల ముందు ఎండలో ఎండబెట్టుకోవాలి), నూనె – వేయించడానికి సరిపడా, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత, ఛాట్ మసాలా లేదా ఆమ్‌చూర్ పొడి కొద్దిగా.
తయారు చేసే విధానం : కడాయిలో తగినంత నూనె వేడిచేసి ఎండబెట్టిన బీరపొట్టును వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మరో కడాయిలో చెంచా నూనె వేడిచేసి ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. బీరపొట్టు వేడిగా ఉన్నప్పుడే ఈ తాలింపూ, తగినంత ఉప్పు, ఛాట్ మసాలా లేదా ఆమ్‌చూర్ పొడి వేసి బాగా కలపాలి. ఈ ఇన్‌స్టంట్ చిప్స్ భలే రుచిగా ఉంటాయి.
కావాల్సిన పదార్థాలు : కందిపప్పు – అరకప్పు, బీరపొట్టు – కప్పు, మినప్పప్పు – చెంచా, ఆవాలు, జీలకర్ర – చెంచా చొప్పున, కరివేపాకు రెబ్బలు – కొన్ని, వెల్లుల్లి రెబ్బలు రెండుమూడు, ఉప్పు – తగినంత, నూనె – రెండు టేబుల్స్పూన్లు, పచ్చికొబ్బరి తురుము రెండు చెంచాలు, ఎండుమిర్చి- రెండు.
తయారు చేసే విధానం : బీరపొట్టును ముక్కల్లా కోసి కడిగి ఉడికించుకుని, నీటిని పిండేసి విడిగా ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే కందిపప్పును కూడా మరీ మెత్తగా కాకుండా ఉడికించి నీటిని వంపేసి తీసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇవి వేగాక కందిపప్పును వేసేయాలి. ఇది పొడిగా అయ్యాక బీరపొట్టు కూడా వేసి వేయించాలి. కూరంతా పొడిపొడిగా అయ్యాక తగినంత ఉప్పూ, పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి దింపేయాలి.
కారప్పొడి
కావాల్సిన పదార్థాలు : బీరపొట్టు – రెండు కప్పులు, శెనగపప్పు, మిన ప్పప్పు, నువ్వులు – పావుకప్పు చొప్పున, ఇంగువ – చిటికెడు, ఎండు మిర్చి ఐదారు, చింతపండు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు- ఐదారు, కరివేపాకు – పది ఆకులు, నూనె – పావుకప్పు, ఉప్పు – తగినంత.
తయారు చేసే విధానం : నువ్వుల్ని నూనె లేకుండా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో రెండు చెంచాల నూనె వేడి చేసి బీర పొట్టును దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన, నీరు పోయాక తీసి పెట్టుకోవాలి. అదే కడాయి లో మిగిలిన నూనె వేడి చేసి శెనగపప్పు, మిన ప్పప్పు, ఇంగువా, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు,కరివేపాకు వేయించుకుని పొయ్యి కట్టేయాలి. ముందుగా బీరపొట్టును మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత శెనగ పప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లీ, కరి వేపాకూ, చింతపండు తగినంత ఉప్పు మిక్సీలో వేసుకుని పొడిలా చేసుకోవాలి. ఈ కారాన్ని చేసి పెట్టు కున్న బీరపొట్టు పొడిలో వేసి కలిపితే సరిపోతుంది. ఈ పొడి ని వేడివేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే రుచిగా ఉంటుంది. ఇది వారం వరకూ నిల్వ ఉంటుంది.