రైలు ప్రమాదాల నివారణలో బీజేపీ ప్రభుత్వం విఫలం

– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -ఆలేరుటౌన్‌
రైలు ప్రమాదాలను నివారించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణంగా ఒడిషా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో గురువారం విలేకర్ల సమావేశంలో చెరుపల్లి మాట్లాడారు. రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రయాణికులు ప్రాణం కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలలో ప్రయాణికుల రక్షణను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రైల్వే వ్యవస్థలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని భర్తీ చేయకుండా తాత్సారం చేయడం వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాలుగా మారుతున్నాయన్నారు. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో మహిళలు, పేదల పట్ల నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు గురిచేశారని, అతన్ని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని ఢిల్లీ నడివీధిలో మూడు నెలలుగా మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పైగా ఉద్యమాలను అణచి వేసేందుకు పోలీసుల చేత దాడులు చేయిస్తోందన్నారు. మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్న బ్రిజ్‌ భూషణ్‌లాంటి కీచకులను బీజేపీ వెనుకేసుకొస్తోందని విమర్శించారు. దేశ ప్రజాతంత్ర శక్తులందరూ ఏకమై రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.