నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బీజేపీ

– నిరుద్యోగ మార్చ్‌ చేయటం సిగ్గుచేటు
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
తాము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువకులను నమ్మించి ఓట్లు పొంది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులందరినీ నిలువునా మోసం చేసిందన్నారు. ”నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు” అన్న చందంగా మే 27న ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్‌ చేయటం విడ్డూరంగా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. నరేంద్ర మోడీ-బిజెపి యిచ్చిన వాగ్దానం ప్రకారం దేశంలోని యువకులకు 18 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలన్నారు. ఎన్ని కోట్లు యిచ్చారో చెప్పగలరా అని సవాల్‌ చేశారు. 18 కోట్ల ఉద్యోగాలు యివ్వకపోగా, దేశంలో ఖాళీ అయిన 40 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయని అసమర్థ ప్రభుత్వమన్నారు. చివరికి దేశ రక్షణ కోసం పనిచేయాల్సిన సైనిక ఉద్యోగాలను కూడా అగ్నిపథ్‌ పేరుతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల స్థాయికి దిగజార్చింది అన్నారు. రాష్ట్రంలో బిజెపికి నిరుద్యోగులపై ప్రేమ కంటే అబద్దాలు- అసత్యాలతో అధికారంలోకి రావటమే లక్ష్యంగా విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. నిరుద్యోగులు ఎవరూ బిజెపిని నమ్మరని, ఖమ్మం జిల్లాలో మతతత్వ కుట్రలు, కుయుక్తులు చెల్లవన్నారు. ముందు మీరు 9 సం.ల క్రితం యిచ్చిన హామీలను అమలు చేయాలని నరేంద్ర మోడీని అడిగే ధైర్యముందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిజెపి నిర్వహించే నిరుద్యోగ మార్చ్‌లలో నిరుద్యోగులెవరూ లేరన్నారు. బిజెపి కార్యకర్తలు లేదా డబ్బులిచ్చి తెచ్చే కూలీలు మాత్రమే నన్నారు. రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలలో బిజెపిని తరిమికొట్టటానికి నిరుద్యోగులు సమాయత్త మవుతు న్నారని ఆయన హెచ్చరించారు.