నవతెలంగాణ-షాద్‌నగర్
ఆదరించండి అభివద్ధి చేసి చూపిస్తానని, ఒక్కసారి అవకాశం ఇస్తే షాద్‌నగర్‌ను అభివద్ధి చేస్తానని బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాల్‌లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా షాద్ నగర్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై తన గలం విప్పుతానని అన్నారు. ప్రజల స్వేచ్ఛ కోసం అన్ని వర్గాల విముక్తి కోసం పాటుపడతానని ఆయన అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ చైతన్య దిశగా ప్రజలను మేల్కొల్పేందుకు తన అడుగులు పడనున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోకడలపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని అన్నారు. త్వరలో షాద్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఐదు వందల కిలోమీటర్ల పాద యాత్ర చేస్తానని తెలిపారు. ఈ పాదయాత్ర చౌదరిగుడా మండలం నుండి మొదలవుతుందని, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏ హౌదాలో లేకున్నా రెండు సార్లు మెగా జాబ్ మేళా నిర్వహించామని, అధికార పార్టీకి నిరుద్యోగుల గురించి ఆలోచించడానికి సమయం కూడా లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, ఏపీ మిథున్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.