గిరిజన తెగల నిర్ములనకు బీజేపీ కుట్ర

– అడవిని కార్పొరేట్‌ శక్తులకు అప్పజేప్పెందుకే ఆదివాసీలపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి : టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌
– మణిపూర్‌ కి సంఘీభావంగా ఆదివాసీల నిరసన ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మణిపూర్‌లో ఆదివాసీలపై కొనసాగుతున్న అనైతిక, లైంగిక దాడులను నివారించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ డిమాండ్‌ చేశారు.
శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో ‘మణిపూర్‌’ ఘటనలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సచిన్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో ఆదివాసీలపై జరుగుతున్న హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనీ, హింసను ఆపే ప్రయత్నం కూడా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన కులాలను ఉద్దేశ పూర్వకంగానే మణిపూర్‌ స్థానిక ఆదివాసీలపై బీజేపీ సర్కారు ఉసిగొల్పిందన్నారు. ప్రధాని మోడీ, బీజేపీి నాయకత్వం మౌనం వహించడం వల్లే పరోక్షంగా అల్లరి మూకలకు బలం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలపై దాడులు చేసి, వారిని అడవులనుంచి ఖాళీ చేయించి, ఖనిజ సంపదలను కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పె కుట్రలో భాగంగానే అక్కడి గిరిజనులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీి ప్రభుత్వం జోక్యం చేసుకుని దాడులు నిలువరించాలని డిమాండ్‌ చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోడసం భీం రావు, బండారు రవి కుమార్‌, మెస్రం రాజు, ఆత్రం తనుష్‌ , పొలం రాజేందర్‌, బైరి సోమేశ్‌, కోట శ్రీనివాస్‌, ఎర్మా పున్నం రాష్ట్ర కమిటీ సభ్యులు గొంది రాజేష్‌, భాగాల రాజన్న, ఉయిక విష్ణు కోరేంగా మాలశ్రీ, ఆత్రం కిష్టన్న మాడవి నాగోరావ్‌ తదితరులు పాల్గొన్నారు.