– నాడు స్వాతంత్రం తెచ్చింది.. నేడు తెలంగాణ ఇచ్చింది
– కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించండి
– సీతక్కకు అడుగడుగునా నీరాజనాలు
నవతెలంగాణ- తాడ్వాయి నాడు స్వాతంత్రం తెచ్చిన పార్టీ, నేడు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఆలోచించి ఆదరించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ములుగు ఎమ్మెల్యే, డాక్టర్ సీతక్క అన్నారు. శనివారం మండలంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రచారంలో భాగంగా వెంగళపూర్, నార్లాపూర్, కాల్వపల్లి, ఊరట్టం, రెడ్డి గూడెం, మేడారం గ్రామాలలో ఆరు గ్యారెంటీలను ప్రజలకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజలు సీతక్కవు అడుగడుగునా నీరాజనాలు తెలుపుతూ బతుకమ్మలతో పూలమాలలతో స్వాగతం పలుకుతూ డోలు వాయిద్యాలతో నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అయినా ప్రజలు తన వైపు ఉన్నారని స్పష్టం చేశారు.
ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందని అనుకుంటారో వారికి ఓటు వేయాలని చెప్పారు. కరోనా కష్టకాలంలో, వరదలు చుట్టుముట్టినప్పుడు ఎవరు మీకు సేవలు అందించారు ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరారు. తాను ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నానని సీఎం కేసీఆర్ నా గొంతు నొక్కేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు వంగి వంగి సలాం చేసే వాళ్ళు కావాలన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఎగిరేది ములుగులో కాంగ్రెస్ పార్టీ జెండా నేనని అన్నారు. నాకు ఓటు వేసి గెలిపిస్తే మళ్లీ నేను మంత్రిని మీ ఊరికి వస్తా అని సీతక్క అన్నారు. నియోజక ప్రజలందరికీ నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పోడు భూముల గురించి నిలదీశానని, తనకు ఎదురే లేకుండా ప్రశ్నించకుండా ఉండేందుకు తనను ఓడించాలని ప్లాన్ చేస్తున్నారంటూ ఆరోపించారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడమే బిఆర్ఎస్ పార్టీ పని అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
ఈ ఎన్నికల తీర్పుతో కేసీఆర్ పదేండ్ల అహంకారం పోవాలని కాంగ్రెస్ పార్టీ రావాలని పిలుపునిచ్చారు. గడిచిన 9 ఏండ్ల కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు చేసింది ఏమి లేదని, హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ను గోతి తవ్వి పాతి పెట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కెసిఆర్ బినామీలు నన్ను ఓడించడానికి వందల కోట్ల రూపాయలు పట్టుకొని ములుగు వచ్చి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ములుగు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా మద్యం, డబ్బులతో ఓట్లు కొందామని వస్తున్నారని, ఒక్కసారి ములుగు ప్రజలు ఆలోచన చేయాలని చెప్పారు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, ప్రభుత్వంపై కొట్లాట చేయడం ప్రశించే గొంతుకైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వం పై పోరాటం చేయడం నేను చేసిన తప్ప అంటూ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు డబ్బులు నమ్ముకున్నారని, నేను ప్రజలను నమ్ముకున్నానని చివరికి గెలిచేది ప్రజలే అనేది మరిచిపోవద్దని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలెబోయిన సృజన, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు అర్రెం లచ్చు పటేల్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ముజఫర్ హుస్సేన్, యూత్ అధ్యక్షులు కోడి సతీష్, ముత్తినేని లక్ష్మయ్య, బాగే నర్సింహులు, చర్ప రవీందర్, డైరెక్టర్లు యానాల సిద్ది రెడ్డి,యాషాడపు మల్లయ్య, సర్పంచులు ఊకే మౌనిక, ఎల్లబోయిన ఝాన్సీ రాంబాబు, జంగా వెంకటరామిరెడ్డి, మాజీ సర్పంచ్ లంజపెల్లి నరసయ్య, ములుగు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మద్దూరు మాధవి రాజు, రాములు, నార్లపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మొక్క శ్రీనివాస్, నాయకులు పులి రవి గౌడ్, తండాల శ్రీను, బొజ్జ అరుణ్, ఎనగంటి రామయ్య, కట్కూరి భాస్కర్, మడకం శోభన్, రాపోలు సంజీవరెడ్డి, కుక్కల ఉప్పలయ్య కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.