– ఇండ్లలోకి పాములు, తేళ్లు
– ముళ్ళ కంపల మధ్య భయం భయంగా జీవనం
నవతెలంగాణ – బోనకల్
ముళ్ళ కంపల మధ్య నిత్యం భయంతో కాలం గడుపుతున్నారు. ప్రతిరోజు పాములు, తేళ్లు ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నాయి. దీనికి తోడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల చుట్టూ పెద్దపెద్ద పొదలు, ముళ్ళ కంపలు. గత్యంతరం లేక భయంతోనే కాలం గడుపుతున్నామని డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో దళిత కాలనీలో 20 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారు. ఆనాటి దళితులకు ఎమ్మెల్యే బోడెపుడి వెంకటేశ్వరరావు హయాంలో దళితులకు ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది. ఈ ఇండ్లు నిర్మించుకోగా ఇంకా సగానికి పైగా ప్రభుత్వ ఖాళీ భూమి ఉంది. ఈ స్థలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించింది. అయితే ఈ ఇండ్లు గతంలో నిర్మించిన ఇళ్లకు వరుస క్రమంలో కాకుండా చివరన నిర్మించారు. మధ్యలో స్థలం ఖాళీగా ఉంది. కొత్తగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు పక్కనే పురాతన వాగు, మరో పక్కన పంట పొలాలు ఉన్నాయి. ఇంకో పక్కన ప్రభుత్వ ఖాళీ స్థలం ఉంది. వీటి మధ్యలో అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారు. ఇక్కడ నుంచే అసలు సమస్య ప్రారంభమైంది. నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు నాశరకంగా ఉన్నాయి. ఇల్లు పంపిణీ చేసే సమయంలోనే అనేక ఇల్లు నెర్రెలు భారీ, గోడలు పగుళ్లు ఇచ్చి ఉన్నాయి. అయినా అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం లబ్ధిదారుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం లాగా ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల చుట్టూ మూడు వైపులా పొలాలు ఉండటంతో పాటు పిచ్చి చెట్లు పెరిగి పాములకు, తేళ్లకు నిలయంగా మారాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పాములు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక పాము, తేళ్లు వస్తున్నాయి. దీంతో తాము ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయం అయితే తమ ఇండ్ల మందు కూడా కూర్చునే పరిస్థితి లేదని, ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ పాము వస్తుందోనని భయం నీడలో బతుకుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అంటే తమకు మరోచోట ఇల్లు లేదని చావో రేవో అన్నట్లు ఇక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతిరోజు దినదిన గండంగా పాములు భయంతో జీవనం సాగిస్తున్నామని, అయినా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరికి చివరన పొలాల మధ్య డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని లబ్ధిదారులు అంటున్నారు. గతంలో ఉన్న ఇళ్లకు వరుస క్రమంలో ఈ ఇల్లు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. అధికారులు తమను విషాసర్పాల నుంచి కాపాడాలని లబ్ధిదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇండ్ల చుట్టూ ఉన్న ముళ్ళ కంపను, పెద్దపెద్ద చెట్లను, ముళ్ళ పొదలను తొలగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.