బాంబే హైకోర్టు జడ్జి రాజీనామా

Bombay High Court Judge Resignation– ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయడం ఇష్టంలేకే
ముంబై : బాంబే హైకోర్టు జడ్జి రోహిత్‌ డియో శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. నాగపూర్‌ బెంచ్‌కు చెందిన జస్టిస్‌ డియో కోర్టులో న్యాయవాదుల సమక్షంలో తాను తన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే డియో తన పదవికి రాజీనామా చేయడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. తన ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయడం ఇష్టంలేకే ఆయన రాజీనామా చేసినట్టు కోర్టులోని ఓ న్యాయవాది తెలిపారు. కాగా, బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్న డియో కీలకమైన తీర్పులను ఇచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా మావోయిస్టు లింక్‌ కేసులో అరెస్టయి.. ఉపా చట్టం కింద అతనికి విధించిన జీవిత ఖైదు శిక్షను డియో గతేడాది రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ఈ ఉత్తర్వుపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఈ కేసును మళ్లీ విచారించాలని నాగపూర్‌ హైకోర్టును ఆదేశించింది. అలాగే జనవరి మూడు నాటి మహారాష్ట్ర ప్రభుత్వ తీర్మానం (జిఆర్‌) యొక్క ఆపరేషన్‌పై డియో గతవారం స్టే విధించారు. జస్టిస్‌ డియో జూన్‌ 2017లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2025 డిసెంబర్‌లో ఆయన పదవీకాలం ముగియనుంది. జడ్జిగా నియమితుల య్యే ముందు డియో 2016లో మహారాష్ట్ర ప్రభు త్వానికి అడ్వకేట్‌ జనరల్‌గా కూడా పనిచేశారు.