కాలితో విల్లును నిటారుగా నిలబెట్టింది. నోటితో బాణం లాగి పట్టింది. గురి చూసి కొట్టింది. కట్ చేస్తే దేశానికి మూడు పతకాలు సాధించింది. సాధారణంగా ఆర్చర్లు ఎవరైనా ఒక చేత్తో విల్లుని పట్టుకుని, మరో చేత్తో బాణాలు సంధిస్తారు. ఎంత సాధన చేసి పోటీలోకి దిగినా చాలా సార్లు గురితప్పుతారు. అలాంటిది రెండు చేతులు లేకుండా బాణాలు వేయడం గురించి ఒక్క సారి ఊహించుకోండి… నిజంగా నమ్మలేకపోతున్నారు కదూ..! కానీ ఇది నిజం. ఆ అద్భుతాన్ని చేసింది శీతల్ దేవి. రెండు చేతులు లేకపోయినా కాలివేళ్లతో విల్లు పట్టి బాణాలు సంధిస్తూ పారా ఆసియా క్రీడల్లో పోటీకి దిగింది. అంతేకాదు ఆ పోటీల్లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆ వివరాలు ఏంటో మనమూ తెలుసుకుందాం…
పదహారేండ్ల శీతల్ కమ్మూకాశ్మీర్‌లోని కిష్త్‌వార్ గ్రామంలో పుట్టింది. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి గొర్రెలను కాస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. శీతల్‌కు చిన్నతనం నుండే ఫొకోమేలియా అనే అనారోగ్య సమస్య వుంది. ఈ వ్యాధి కారణంగా ఆమెకు రెండు చేతులు ఎదగలేదు. దాంతో కాళ్లతోనే పనులు చేసుకోవడం నేర్చుకుంది. రెండు చేతులు లేని శీతల్‌కు చెల్లెలు శివానీనే ఆత్మీయ స్నేహితురాలు. ఆమె అవసరాలన్నీ చెల్లెలు, తల్లీ చూసుకుంటారు. ఆమెకు అన్ని విధాలుగా సహకరిస్తుంటారు.
ఆర్మీ దత్తత తీసుకుని…
మొదటి నుండి ఆటలంటే మక్కువ చూపే శీతల్‌కు అనుకోకుండా ఓ మంచి అవకాశం వచ్చింది. ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఓ క్రీడా శిబిరంలో పాల్గొంది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. క్రీడల్లో ఎంతో ఆసక్తి ఉన్న శీతల్‌ను చిన్నతనంలోనే ఇండియన్ ఆర్మీ దత్తత తీసుకుంది. దాంతో ఆటలపై ఆమెకు మరింత ఆసక్తి పెరిగింది. ఆర్చరీపై మక్కువ పెంచుకొని సాధన చేసింది.
ప్రత్యేక కారు కానుకగా…
బెంగుళూరు సైట్ సీయింగ్ కోసం వెళ్ళినప్పుడు శీతల్ తన స్నేహితుని కారు స్టీరింగ్‌పై కాలు పెట్టి ‘నేనూ ఏదో ఒక రోజు కారు నడుపుతాను’ అంది. ఈ రోజు ఆమె కల నిజం కాబోతోంది. అదెలాగంటే… అంతర్జాతీయ వేదికల్లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులకు కార్లను బహుమతిగా ఇస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ప్రతిభను గుర్తించడంలో, సామాన్యులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈయన తాజాగా చేసిన ఓ పోస్టు అందరిలో స్ఫూర్తినింపుతోంది. నెటిజన్ల చేత ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ‘చేతులు లేకున్నా.. పారా ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి, భారత్‌కు రెండు స్వర్ణ పతకాలను సాధించిపెట్టిన శీతల్ దేవికి ప్రత్యేక కారును బహూకరిస్తాను’ అని ఆయన ప్రకటించారు. తమ కంపెనీ అందిస్తున్న కార్లలో దేన్నైనా ఆమె ఎంచుకోచ్చవని ఆయన శీతల్‌కు ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు.. ఆమె ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కారుకు మార్పులు చేసి అందజేస్తామని కూడా చెప్పారు. ఇలా కారు నడపాలనే శీతల్ కల నిజం కాబోతోంది.
మన సమస్యలు చాలా చిన్నవి
పారా ఆసియా క్రీడల్లో ఆర్చరీకి సంబంధించిన పలు విభాగాల్లో భారత్‌కు మొత్తం 3 పతకాలు (2 స్వర్ణం, 1 రజతం) సాధించి పెట్టిన ఆమె పట్టుదల, ప్రతిభకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా శీతల్‌కు కారును కానుకగా ఇవ్వడమే కాకుండా ఆమెపై ప్రశంసలు కురిపించారు. శీతల్ జీవిత కథను తెలిపే ఓ ప్రత్యేక వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా తన ఫాలోవర్స్‌కు షేర్ చేశారు. ‘ఆమె ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఒక ఉపాధ్యాయురాలు. ఇకపై నేను చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదు చేయబోను..’ అంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇచ్చారు. శీతల్ దేవికి ఉన్న అవరోధాల ముందు మన సమస్యలు చాలా చిన్నవని అంటూ ఆయన చెప్పకనే చెప్పారు.
ప్రపంచంలోనే ఏకైక ఆర్చర్
శీతల్ దేవికి కోచ్‌గా కుల్‌దీప్ వేద్వాన్ వ్యవహరించారు. ఆయనే ఆమెకు ఎంతో శ్రద్ధగా ఆర్చరీలో శిక్షణ ఇచ్చారు. కోచ్ సహకారంతో రెండు చేతులు లేకపోయినా కాళ్లతోనే బాణాలు వేయడం సాధన చేసింది. మెల్లమెల్లగా సాధారణ ఆర్చర్లతో పోటీపడే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచంలో రెండు చేతులు లేకుండా పోటీపడుతున్న ఏకైక ఆర్చర్ శీతల్ దేవీ కావడం గొప్ప విశేషం. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అలీమ్ సహిదా (సింగపూర్)ను ఓడించి స్వర్ణం సాధించింది ఆమె. మిక్స్‌డ్ టీమ్‌లో స్వర్ణం గెలిచింది. ఒకే క్రీడలో రెండు పసిడి పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా కూడా ఆమె ఘనత సాధించింది. మహిళల డబుల్స్‌లోనూ శీతల్ రజతం గెలిచింది. 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ భారత్‌కు పతకాలు సాధించాలని శీతల్ లక్ష్యంగా పెట్టుకుంది.