దళారీలు, కార్పొరేట్‌ సంస్థల లాభాల కోసమే

– కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరలపై తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మద్దతు ధరలు మధ్య దళారీలకు, కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని తెలంగాణ రైతు సంఘం పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉపకరణాల ధరలు 16 నుంచి 20 శాతం పెరిగినప్పటికీ, అందుకనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధరలు పెంచకపోవడమేంటని ప్రశ్నించింది. అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నా…వాటిని కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించింది. కేవలం 23 పంటలకు మాత్రమే మద్దతు ధరలు ప్రకటించి చేతులు దులుపుకుందని పేర్కొంది. ఈమేరకు గురువారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, టి. సాగర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిన సంగతి తెలిసిందే. క్వింటాల్‌ ధాన్యానికి 143 రూపాయలు, వేరుశనగకు రూ.527 పెంచిందని తెలిపారు. గతేడాదిలో పెంచిన దానికి ఇది అదనమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు. వాస్తవానికి 2022-23లో ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం కూడా ప్రకటించలేదని తెలిపారు. అప్పటి మద్దతు ధరలపై ఎంతో కొంత పెంచుతూ, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆదరాబాదరగా మరోసారి ఎమ్‌ఎస్‌పీని ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాటికి శాస్త్రీయత లేదని తెలిపారు. వ్యవసాయ పంటల పెట్టుబడిని శాస్త్రీయంగా నిర్ణయించి దానికి 50 శాతం కలిపి ధరలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థల ద్వారా అన్ని పంటలను కొనుగోలు చేసి రైతుకు రక్షణ కల్పించాలని కోరారు. సంయుక్త కిసాన్‌ మోర్చా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ‘మద్దతు ధరల చట్టాన్ని’ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని వారు డిమాండ్‌ చేశారు.