– సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మాట ఒకటి అయితే.. చేతల్లో మరొకటి ఉంటుందని, చెప్పినది ఇప్పటి వరకు ఏ ఒక్కటి చేయలేదని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు . శుక్రవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. పోడుసాగు చేసుకుంటున్న భూమి అంతటికి సాగుదారులకి పోడు హక్కు పట్టాలు ఇస్తామని, చెప్పి అందరికి ఇవ్వకపోగా.. ఇచ్చిన వారికి ఎకరా నుండి రెండు, మూడు ఎకరాలకే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు. ఇక మాజీ మంత్రి గ్రామమైన గండుగలపల్లి, ఎల్లన్ననగర్, గుడిపాడు ప్రాంతాల్లో హక్కుపత్రాలు ఇవ్వలేదన్నారు. భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పోడు పట్టాలు సక్రమంగా పంపిణీ చేయలేదన్నారు. పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తామని ,చెప్పి విస్మరించిన బిఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు. పోడు సాగుదారులపై కేసులు ఎత్తివేయాలని, ప్రజాపంథా తో పాటు ఇతర వామపక్ష పార్టీలన్ని డిమాండ్ చేస్తే కేవలం హక్కు పత్రాలు పొందిన రైతుల మీదనే కేసులు ఉపసంహించుకుంటున్నట్లు ప్రిన్సిపల్ ఛీఫ్ కన్సోరేటివ్ ఆఫ్ ఫారెస్టు అధికారి ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. పోడు సాగుదారులందరిపై ఉన్న కేసులను తక్షణమే ఉపసంహించుకోవాలని డిమాండ్ చేశారు. పోడు సర్వే చేయని ప్రాంతాల్లో సర్వే పూర్తి చేసి, రాజకీయాలకు అతీతంగా పట్టాలు ఇవ్వాలని కోరారు. పాలస్తీనా ప్రజల పోరాటానికి తమ పార్టీ సంఘీభావం తెలుపుతుందని. జన్మ భూమి కోసం పోరాటం చేస్తున్న పాలస్తీనా ప్రజలకు మద్దతుగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సభలు నిర్వహించాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాపంథా పోటీ చేస్తుందని, వామపక్షాలు ఐక్యంగా పోటీ చేసేందుకు చర్చలు జరుపుతామని తెలిపారు. జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గృహలక్ష్మీ ఇచ్చినట్లే ఇచ్చి 50 రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలనడం సరైనది కాదని, పథకం పట్టాలు కాదన్నారు. లబ్దిదారులకు సమయం ఇచ్చి, ఇంటి పని ప్రారంభించిన వెంటనే నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, జి. రామయ్య, సిఐ పుల్లయ్య పాల్గొన్నారు.