దరఖాస్తు చేసుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌

– టికెట్‌ కోసం నేడు రేవంత్‌ దరఖాస్తు
– సీఎల్పీ నేత భట్టి, ఉత్తమ్‌ దంపతులు
– ఇప్పటికీ 310 దరఖాస్తులు
– మరో మూడు రోజులే సమయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలన్న ఆదేశాల మేరకు ఆశావహులు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. దీంతో గాంధీభవన్‌ ఆవరణం కోలాహలంగా మారింది. దరఖాస్తు చేసుకునే సమయంలో కొంత మంది అభ్యర్థులు డప్పుల దరువులతో వస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం మంచి ముహుర్తం ఉండటంతో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఆయన భార్య ఉత్తమ్‌ పద్మావతి తదితరులు దరఖాస్తు చేసుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 25వేలు, ఇతరులకు రూ. 50వేలు డీడీ రూపంలో టీపీసీసీ పేరిట చెల్లిస్తు న్నారు. మంగళవారం నాటికి 310 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకు నేందుకు మరో మూడు రోజుల సమయం ఉండటంతో అత్యధిక దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ కొనగాల మహేష్‌ టికెట్‌ కోసం కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి దరఖాస్తు చేశారు.తన దరఖాస్తును టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అందజేశారు.