బీఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేయాలి

– ఎంపీ రవిచంద్ర
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెంలో నవంబర్‌ 5 తేదీన జరిగే బీఆర్‌ఎస్‌ ”ప్రజా ఆశీర్వాద సభ”ను విజయవంతం చేయడం, వనమాను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించడం, కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎంగా కూర్చోబెట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుదామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీ రవిచంద్ర కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమాతో కలిసి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. ప్రజా ఆశ్వీరాద సభను దిగ్విజయం చేయడం, వనమా వెంకటేశ్వరరావును గెలిపించి తిరిగి అసెంబ్లీకి పంపించడం, కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి సీఎంగా కూర్చోబెట్టేందుకు మనమందరం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేద్దామన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని, బీఆర్‌ఎస్‌ కోసం కష్టపడి పనిచేసే వారి వివరాలు తనతో పాటు పార్టీ పెద్దలందరికి ఎప్పటికప్పుడు తెలుస్తుందని, తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, ప్రాధాన్యత ఉంటుందన్నారు. మనమందరం మరింత కృషి చేసి రాజకీయాలలో 50ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రయాణం చేసిన వనమాను భారీ ఓట్ల మెజారిటీతో మరోసారి గెలిపిద్దామన్నారు. తాను మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర రావు, పినపాక నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి కోనేరు సత్యనారాయణ (చిన్ని), ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.