బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల వ్యాపార భాగస్వాములు టార్గెట్‌

వైష్ణవీ గ్రూపు, వైఆర్‌పీ సంస్థలపై ఐటీ దాడులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖాధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం నాలుగో రోజు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు చెందిన వ్యాపార భాగస్వాముల ఆస్థులను ఐటీ అధికారులు టార్గెట్‌ చేశారు. గత మూడ్రోజులగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు చెందిన నివాసాలు, వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థల కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వీరి సంస్థల్లో లభించిన కొన్ని పత్రాల ఆధారంగా వారి వ్యాపార భాగస్వాములను గుర్తించి ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా జనార్ధన్‌రెడ్డి వ్యాపార భాగస్వామి అయిన వైఆర్‌పీ ట్రస్టు చైర్మెన్‌ వై రవి ప్రసాద్‌కు చెందిన మాదాపూర్‌లోని నివాసంతో పాటు జూబ్లిహిల్స్‌, మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆయన వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అంతేగాక, వీరికే చెందిన భారీ ఇండ్ల నిర్మాణ సంస్థ వైష్ణవీ గ్రూపు కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలను నిర్వహించారు. కాగా, వైఆర్‌పీ సంస్థకు చెందిన కొన్ని వ్యాపారాల్లో జనార్ధన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డిలకు వాటాలున్నట్టు ఐటీ అధికారులు తేల్చినట్టు తెలిసింది. మొత్తమ్మీద గత నాలుగురోజులుగా బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, వారి వ్యాపార భాగస్వాములపై వరుసబెట్టి ఐటీ అధికారులు దాడులను కొనసాగించటం కలకలం రేపుతున్నది. ఈ దాడులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.