– టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీని బీఆర్‌ఎస్ కామెడీ సినిమాగా మార్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తంగా శాసనసభ గులాబీ పార్టీ సమావేశాలను తలపించాయని విమర్శించారు. ఎన్నికల హామీలు ఎంతవరకు అమలు అయ్యాయో చర్చ జరుగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశేమిగిల్చిందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు బొజ్జ సంధ్యారెడ్డి, లింగం యాదవ్, వచన్ కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేదిక కావాల్సిన సభ…రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేసేందుకు పరిమితమైందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో రేవంత్ లేవనెత్తిన అంశాలకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. రెండు సార్లు అధికారంలో ఉండి ఏం చేశారో ఎందుకు చెప్పలేదన్నారు. కొత్త సచివాలయంలో వర్షపు నీళ్లు ఎందుకు నిలిచాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివద్ధిలో ఉంటే, కేసీఆర్ పాలనలో అగాధంలో ఉందని ఎద్దేవ చేశారు.కేసీఆర్ అసమర్ధ పాలన నుంచి ప్రజలకు విముక్తి కావాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో ఉన్నదంతా టీడీపీ నాయకులేనని గుర్తు చేశారు. తెలంగాణ ద్రోహులను పక్కన కూర్చోబెట్టుకొని ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌తో లబ్ది పొందాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు.