– ఇద్దరు అస్సాం రైఫిల్స్ సిబ్బందికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోనే ఉంది. సాయు ధ దుండగులు రెచ్చిపోతూనే ఉన్నారు. మంగళవారం తెల్లవారు జామున జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)కు చెందిన ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. కాక్‌చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామం వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా మంగళవారం ఉదయం 4:15 సమయంలో సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. మృతి చెందిన బీఎస్‌ఎఫ్ కాని స్టేబుల్‌ను రంజిత్ యాదవ్‌గా గుర్తించారు. గాయపడిన సిబ్బందిని వాయు మార్గం ద్వారా మాన్‌త్రిపుఖ్రిలోని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగు తున్నాయని సైన్యం తెలిపింది. దుండగులు భారీ స్థాయిలో కాల్పులు జరుపుతున్న సమయంలో రంజిత్ యాదవ్ ధైర్యాన్ని, అంకితభావాన్ని, కర్తవ్య నిర్వహణ పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించాడని బీఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగింపు
మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతూనే ఉండటంతో రాష్ట్రంలోని ఇంటర్నెట్‌పై నిషేధాన్ని మరికొన్ని రోజులు పొడిగించారు. ఈ నెల 10 తేదీ సాయంత్రం 3 గంటల వరకూ రాష్ట్రంలో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని పొడిగించినట్టు కమిషనర్ (హోం) హెచ్ జ్ఞాన ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రాడ్‌బ్యాండ్‌తో సహా మొబైల్ డేటా సర్వీసులపై ఇంటర్నెట్ నిషేధం కొనసాగుతుందని తెలిపారు. మణిపూర్‌లో మే 3 నుంచి ఇంటర్నెట్‌పై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే, ప్రస్తుతం మణిపూర్‌లో 10 వేలకు పైగా ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మొహరించి ఉన్నారు.