– స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు
– 100 ఎకరాల్లో 14 ప్లాట్లు ఆన్‌లైన్‌లో వేలం
– ఎకరం అత్యధిక ధర రూ.41.25 కోట్లు
– అత్యల్పంగా రూ.33.25 కోట్లు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ భూములు ప్రభుత్వ భూములేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూముల వేలంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు గురువారం ఆన్‌లైన్‌లో ప్లాట్లు వేలం వేశారు. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభమైంది. మొత్తం వంద ఎకరాల్లో 14 ప్లాట్లకు వేలం వేయగా.. ప్రభుత్వానికి రూ.3,625.73 కోట్ల ఆదాయం చేకూరింది. ఎకరం ధర అత్యధికంగా రూ.41.25 కోట్లు పలకగా, అత్యల్పంగా రూ.33.25 కోట్లు పలికింది. రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 100 ఎకరాల్లో 14 భారీ ప్లాట్లను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. ఎకరం భూ మి కనీస నిర్దేశిత ధర రూ.20 కోట్లుగా నిర్ణయించింది. ఈ లెక్కన 100 ఎకరాలకు రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ ప్రభుత్వ అంచనాలకు మించి ధర పలికింది. భూములపై హైకోర్టులో విచారణ సందర్భంగా హెచ్‌ఎండీఏ అడ్వకేట్స్ పూర్తి రికార్డులను కోర్టుకు అందజేసి వాదనలు వినిపించారు. దీంతో ఈ భూముల వేలంపై స్టే ఇచ్చే ందుకు హైకోర్టు నిరాకరించింది. పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వేలం లో పాల్గొని విజయవంతం చేశారని హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు తెలిపారు.