”నీ చేతను, నా చేతను, వరమడిగిన
కుంతి చేత, వాసపు చేతన్
ధర చేత, భార్గవు చేత
నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్”
కర్ణుడి చావుకు కారణమైన ఆర్గురి గురించీ మహభారతంలో వివరించిన ప్రసిద్ధ పద్యం చాలామంది నోళ్ళలో నానుతూంటుంది. కేసీఆర్ తన ఓటమికి కారణాలు వెతుక్కుంటూ వానప్రస్థంలాంటి తన ఫామ్‌హౌస్‌లో వేగుల్ని తిట్టుకుంటున్నాడో, జ్యోతిష్యుల్నే శాపనార్థాలు పెట్టుకుంటున్నాడో తెలియదు. తెలంగాణ సాధించిన పార్టీగా ఈ నాలుగు కోట్ల మందినీ పాలించే హక్కు తనకు జన్మత: సంక్రమించిన వరంగా భావించిన బీఆర్‌ఎస్ పాలకులకు సామాన్య జనం, ముఖ్యంగా నిరుద్యోగుల నుండి చిరుద్యోగుల వరకు కర్రుకాల్చి వాత పెట్టారు. నాడు సకల జనుల ఉద్యమానికి జీవం పోసింది నిలిచిన బొగ్గు ఉత్పత్తి, ఆగిన ప్రగతి చక్రాలు (ఆర్టీసీ బస్సులు) రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు.. నేడు కోల్‌బెల్ట్‌లో పదకొండుకు పది స్థానాల్లో గులాబీ జెండా బోసిపోగా, దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వోద్యోగులు, టీచర్లు గులాబీ శ్రేణులకు దిమ్మతిరిగేలా చేశారు. పోస్టల్ బ్యాలెట్లే ఇందుకు తార్కాణం. ఆర్టీసీ ఉద్యోగులు తమ గాయాలను తడుముకుంటూ గులాబీ తోటను ధ్వంసం చేశారు. 36కి 24 క్లస్టర్‌లలో బీడీ కార్మికులు కసిగా బీఆర్‌ఎస్‌ను ఓడించారు.
ఎవరికీ అందనంత ‘ఎత్తు’లో అధినాయకుడు, అయిన కాడికి జరుపుకునే ప్రమధగణాలు, ఆయన కాలు బయట పెడ్తే గొడుగుపట్టే అధికారగణాలు, చిన్న దొరకు పర్సంటే జీలు సమర్పించుకునే యాప్‌ల ఓనర్లు – పదేళ్లు మోసి.. ఎత్తి కుదేశారు. ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కాంగ్రెస్ అందిపుచ్చుకుంది.’ఆపరేషన్’ సక్సెస్ చేసింది. ముఠాలు, అంతర్గత కుమ్ములాటలను అధిష్టానం అదుపు చేయ గలిగింది. ఫలితంగా కొత్త సర్కారు కొలువు దీరనుంది. రాబోయే నూతన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి ‘నవతెలంగాణ’ స్వాగతం చెబుతూ శుభాకాంక్షలు పలుకుతున్నది.
ఇవన్నీ ఒకెత్తయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లను బీజేపీ చేజిక్కించుకోవడం భారత ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాద హెచ్చరికలు. తెలంగాణలో కూడా బీజేపీ బలం మూడు నుండి ఎనిమిదికి పెరగడం మన ముంగిటకొచ్చిన పెను ప్రమాదమే. హిందీ బెల్ట్‌లో కొనసా గుతున్న హవా 2024లో హాట్రిక్ విజయానికి దారులు పరుస్తుందని బీజేపీ శ్రేణులు రెట్టింపు విశ్వాసంతో ఉన్నాయి.
ఇదంతా రామాయణమూ కాదు, అది పిడకల వేటా కాదు. ఇదే అసలు వేట. ఇదే అసలు కథ. ఒక పక్క ఫలితాలు చూసుకుంటూ జనం తమ బతుకులేమవుతాయో అని ఆందోళనగా వుంటే ఎకనామిక్ టైమ్స్ పత్రికలో మోర్గాన్ స్టాన్లీ (పెద్ద అమెరికన్ బహుళజాతి బ్యాంకు) ఈ ఎన్నికల ఫలితాలు 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం కలిగి ఉంటాయి. బీజేపీ విజయంతో మన బాంబే స్టాక్ ఎక్సేంజి (సెన్సెక్స్) 10శాతం పెరుగుతుంది. కలగూర గంప ఇండియా కూటమి గెలిస్తే 40శాతం పడిపోతుందని పేర్కొంది. ఎందుకంటే బీజేపీ గెలుపు సుస్థిరమైన పాలనందిస్తుందట! బీజేపీ కోసం దేశ, విదేశ పెట్టుబడి దారులు తపిస్తున్న తీరుకు నిదర్శనమది. అంటే కాంగ్రెస్ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నిలబడే పార్టీ అని ఎంత మాత్రమూ కాదు. పార్లమెంటులో ఈ పార్టీల సుస్థిర పాలనంటే అర్థం కష్టజీవులపైనా, వారి ఉద్యమాలపైనా దాడి. అది రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్ర సర్కారైనా తమపై జరిగే దాడులు దౌర్జన్యాలను ఎల్లవేళలా సహి స్తూ కూచోరనేది మన కళ్లెదుటున్న సత్యం.
కేసీఆర్ సర్కార్ అలివిగాని అప్పుల కుప్ప కాంగ్రెస్‌కు ఒప్పగించి పోయింది. సాలినా సుమారు రూ.20 వేల కోట్ల వడ్డీ లతో సహా 3 లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ సర్కార్‌కు ఒక సవాలు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు, స్కాలర్‌షిప్పుల బకాయి సుమారు 35 వేల కోట్లుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక కొందరు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కీలకమైన అంశం-ఆషాలు, అంగన్‌వాడీల వంటి స్కీం వర్కర్లకు వేతనాల బకాయిలు నిరం తరం పేరుకుపోతున్నాయి. కోటి మంది షెడ్యూల్డ్ కార్మికుల వేతనాలు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచినవే! గత పదేండ్లలో బీఆర్‌ఎస్ పెంచలేదు. పాత పెన్షన్ స్కీం వస్తుందని ఎన్నో ‘పండు టాకులు’ ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ వీటన్నింటినీ (బీఆర్‌ఎస్ విధానాలను) రివర్స్ చేస్తుందనే గంపెడాశతో ఈ ప్రజలున్నారు.
ఆరు వాగ్దానాలు భారీగా చేశారు. అమలు ఆలస్యం జరిగితే చొక్కాలు పైకి మడిచి, కొంగు నడుముకి చుట్టి ఉద్యమబాట పట్టకుండా చూసు కోవాల్సిన బాధ్యత కొత్తగా కొలువు తీరబోయే కాంగ్రెస్ సర్కార్‌దే! అయినా లౌకిక శక్తులను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పాత్ర ఎడల అనేక ప్రాంతీయ పార్టీలు, సీపీఐ(ఎం) వంటి జాతీయ పార్టీలు తీవ్ర అసంతృప్తిని వెల్లడించాయి. ‘లౌకిక శక్తులు రెట్టింపు కృషి చేయాలని సీతారాం ఏచూరి చెప్పిన మాటలను దృష్టిలో ఉంచుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందని ఆశిద్దాం.