– చర్చనీయాంశంగా అనుచరుడు కాని అనుచరుడి చేరిక
– రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో మట్టా దయానంద్ చేరిక
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడిగానీ అనుచరుడిగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గ నేత మట్టా దయానంద్, రాగమయి దంపతులు శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మరికొందరు నేతల సమక్షంలో దయానంద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కారణాలు ఎలా ఉన్నా కొంతకాలంగా పొంగులేటికి దూరంగా ఉంటున్న దయానంద్ కాంగ్రెస్‌లో చేరడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి రాజకీయ వ్యూహంలో భాగంగా దయానంద్ ముందుగానే హస్తం గూటికి చేరాడా? లేక సొంత ఎత్తుగడలో భాగంగా చేరారా.. అన్నది తెలియాల్సి ఉంది. దయానంద్ చేరికతో పొంగులేటి అడుగులు కాంగ్రెస్ వైపు పడనున్నాయనే దానికి సంకేతంగా పలువురు భావిస్తున్నారు. దయానంద్‌తో పాటు ఆయన భార్య రాగమయి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, ఆత్మ కమిటీ మాజీ చైర్మెన్ రామకృష్ణ, మరికొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాగా, ఒక దశలో పొంగులేటి బీజేపీలో చేరతారానే వాదన బలంగా వినిపించడంతో ఆయన ప్రధాన అనుచరగణంలో ఒకరైన మట్టా దయా నంద్ దాన్ని వ్యతిరేకించారు. బీజేపేతర పార్టీ అయితేనే తన పయనం పొంగులేటితో కొనసాగుతుందని కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే రాజకీయం కంటే ఆర్థిక అంశాలే శ్రీనివాసరెడ్డికి దయానంద్‌కు మధ్య దూరాన్ని పెంచాయని ఆయన అనుచరగణం అంటోంది. పొంగులేటి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నాటి నుంచి ఆయన వెంట నడిచేందుకు సిద్ధమైన పెనుబల్లి మండలానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ కొల్లూరు సుధాకర్ ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. మట్టా దయానంద్‌కు ప్రత్యామ్నాయంగా సుధాకర్‌ను ముందుకు తెచ్చినట్టు ప్రచారం ఉంది. దయానంద్ కాంగ్రెస్‌లో చేరడంతో పొంగులేటి కూడా అటువైపే పయనిస్తారా? కాంగ్రెస్‌లో చేరితే సత్తుపల్లి టిక్కెట్ ఎవరికి ఇప్పిస్తారు? ఇప్పటికే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. పొంగులేటి గ్రూపులో ఉన్న ఎస్సీ కమిషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి కూడా గతంలో ఇక్కడి నుంచే పోటీ చేశారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే సత్తుపల్లి అసెంబ్లీ టిక్కెట్‌కు తీవ్ర పోటీ తప్పేలా లేదు. ఒకవేళ పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే మాత్రం కొల్లూరు సుధాకర్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆయన అనుచరగణం అంటోంది.