– దేశంలో పెరుగుతున్న కేసులు
– లోక్‌సభలో వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ : భారత్‌లో క్యాన్సర్ మహమ్మారి గతేడాది 8 లక్షల మందిని బలిగొన్నది. క్యాన్సర్ కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపింది. కేంద్రం పొందుపర్చిన సమాచారం ప్రకారం.. 2020 నుంచి 69,000 కేసులు పెరగడంతో 2022లో 14.61 లక్షల మందికి పైగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే, పంజాబ్‌లో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక్కడ క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయి. గతేడాది క్యాన్సర్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 40,435గా ఉన్నది. వీరిలో 23,301 మంది రోగులు మరణించటం గమనార్హం. 2021లో పంజాబ్‌లో క్యాన్సర్ మరణాల సంఖ్య 22,786గా ఉన్నది. పొరుగున ఉన్న హర్యానా, రాజస్థాన్‌లలో గతేడాది మరణాల సంఖ్య వరుసగా 16,997 మరియు 41,167గా నమోదయ్యాయి.యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, బీహార్, మధ్యప్రదేశ్‌లు క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఐసీఎంఆర్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం.. 2022లో భారతదేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య (0-14 వయస్సు గలవారు) 35,017గా ఉన్నది. మౌలిక సదుపాయాలకు సంబంధించి తీసుకున్న చర్యల విషయంలో మంత్రిత్వ శాఖ 19 రాష్ట్ర క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లు, 20 తృతీయ కేర్ కేన్సర్ సెంటర్‌లను ఆమోదించినట్టు తెలిపింది. అయితే, ఇందులో ఇప్పటివరకు 17 ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే పని చేస్తుండటం గమనార్హం.