యువభారతాన్ని నైపుణ్య కేంద్రంగా మార్చలేమా?

Young India
Can't it be turned into a skill center?ప్రతి విద్యావంతుడు ఓ మహత్తర శక్తి మాత్రమే కాదు, ఓ బహుళ అనువర్తిత వ్యవస్థ. మేధోశక్తి మాత్రమే సమాజ గతిని మార్చగలిగే అమూల్య వనరు అని మనకు తెలుసు. ప్రపంచ దేశాల అభివృద్ధిని విద్యా సంపన్నుల సంఖ్యతో ప్రమాణీకరించడం పరిపాటయ్యింది. విద్యలేని వాడు విలువ లేని వింతజీవి అంటున్నాం. దేశ ప్రగతికి ప్రథమ ప్రాధాన్య తనిస్తూ, కుటుంబ ఎదుగుదలకు, వ్యక్తిగత వికాసానికి దోహద పడగలిగేది మాత్రమే అసలైన విద్య. విద్యతో వివేకం తోడైతేనే ఉన్నత వ్యక్తిత్వం సిద్ధిస్తుంది. బుద్దిలేని నిరక్షరాస్యుడి కన్న అనైతిక విద్యావంతుడు జాతికి అతి ప్రమాదకరం.
విద్య ప్రయోజనాలలో ప్రకాశవంతమైన వ్యక్తిత్వం, దేశా భివృద్ధికి దోహదపడడం, సమాజాన్ని జాగత పరచడం, అవకాశాలను వినియోగించుకోవడం, ఉద్యోగాన్ని పొందడం, ఆదాయం పెరిగి పేదరికం తగ్గడం, నాణ్య మైన జీవితాన్ని గడపడం, నేర ప్రవృత్తిని ద్వేషించడం, ఆర్థిక సామాజిక, సాంస్కృతిక సమానత్వాన్ని నమ్మడం, మానవీయ విలువలను జీర్ణించుకోవడం, జీవన ప్రమాణాలు పెరగడం, కుటుంబ అభివృద్ధి జరగడం, చక్కటి జీవనశైలిని పాటించడం, వృత్తిలో ఎదగడం, ఆలోచనా విస్తృతి, సంభాషణా చాతుర్యం పెరగడం లాంటి పలు సుగుణాలు విద్యతో ప్రాప్తిస్తాయి. సన్మార్గంలో నడవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం, విజ్ఞానాన్ని కాచి వడబోయడం, శారీరక మానసిక సమతుల్యతను నిలుపు కోవడం, పలు రకాలైన నైపుణ్యాలను స్వంతం చేసుకోవడం, సరైన ప్రశ్నలకు ధీటైన సమాధానాలు ఇవ్వగలగడం, గౌర వాన్ని పొందడం, తార్కిక విశ్లేషణ కలిగి ఉండడం లాంటి అనువర్తనాలు అనేకం విద్యావేత్తలకు ఉంటాయి.
నేడు భారతదేశ అక్షరాస్యతా రేటు 77.7 శాతం మాత్ర మే ఉంది. ఇండియాలో అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రా లలో కేరళ (96.2 శాతం), ఢిల్లీ (88.7 శాతం), ఉత్తరాఖండ్‌ (87.6 శాతం), హిమాచల్‌ (86.6 శాతం)లు ముందు వరు సలో ఉన్నాయి. భారత్‌లో అల్ప అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రా లలో ఆంధ్రప్రదేశ్‌ (66.4 శాతం), రాజస్థాన్‌ (69.7 శాతం), బీహార్‌ (70.9 శాతం), తెలంగాణ (72.8 శాతం)లు జాబితా చివరలో ఉన్నాయి. మన దేశ గ్రామీణుల్లో 73.5 శాతం, పట్ట ణాల్లో 87.7 శాతం అక్షరాస్యత రేటు నమోదైంది. భారత్‌లో పురుషుల్లో 84.7 శాతం, మహిళల్లో 70.3 శాతం గమనిం చబడింది. గ్రామీణ కుటుంబాల్లో 4 శాతం, పట్టణ కుటుం బాల్లో 23 శాతం కంప్యూటర్‌ వసతులు కలిగి ఉన్నాయి. 15 – 29 ఏళ్ల గ్రామీణ యువత 24 శాతం, పట్టణ యువత 56 శాతం కనీక కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు.
ప్రపంచ దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత మన దేశం మూడో అతి పెద్ద ఉన్నత విద్యా వ్యవస్థను కలిగి ఉన్నది. విశ్వ దేశాల్లో అత్యధిక యూనివర్సిటీలు కలిగిన దేశంగా భారత్‌కు పేరుంది. మన దేశంలో 56 కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, 459 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 127 డీమ్డ్‌ విశ్వవిద్యాల యాలు, 430 ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. గుజరాత్‌లో అత్యధికంగా 94 యూనివర్సిటీలు ఉన్నాయి. భారతదేశంలో 1.5 మిలియన్ల పాఠశాలల్లో 260 మిలియన్ల విద్యార్థులు ఉన్నారని, పాఠశాల విద్యలో మన దేశం చైనా తరువాత 2వ స్థానంలో ఉన్నది. ఇండియా ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో, జిఆర్‌ఈ) 27.1 శాతం నమోదైంది. లక్ష జనాభాకు అందు బాటులో ఉన్న కళాశాలల సంఖ్యలో బీహార్‌లో 7, తెలంగాణ లో 59 ఉండగా, దేశ సగటుగా 28 కళాశాలలు ఉన్నాయి. మన దేశంలో ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి విజ్ఞానం, ఉద్యోగ సాధన నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు ఆశించిన స్థాయిలో కనిపించకపోవడం విచారకరం.
విద్యాలయాల్లో వసతుల లేమి, కనీస మౌలిక వనరుల కొరత, ఆర్థిక లోటు, అవినీతితో నిండిన విద్యాలయాల మాఫియా, విద్యను వ్యాపారంగా చూసే యాజమాన్యాలు, నిష్ణాతులైన అధ్యాపకుల కొరత లాంటి సమస్యలు రాజ్యమేలు తున్నాయి. విద్యార్థి : ఉపాద్యాయ నిష్పత్తి అమెరికాలో 13 : 1, చైనాలో 20 : 1 ఉండగా, ఇండియాలో 30 :1 ఉండడం మన విద్యావ్యవస్థ పట్ల పాలకుల అంకితభావం తేటతెల్లం అవుతున్నది. మన దేశంలో 25 శాతం కళాశాలలు/ విశ్వవిద్యా లయాలు మాత్రమే గుర్తింపు పొందగా, వీటిలో 30 శాతం కళాశాలలు, 45 శాతం విశ్వ విద్యాలయాలు మాత్రమే ‘ఏ’ గ్రేడ్‌ జాబితాలో ఉన్నాయి. పరిశోధనల్లో అల్ప ప్రమాణాలు, ఆధు నిక ప్రయోగశాలల లోటు, ఇంటర్‌డిసిప్లినరీ పరిశోధనల లేమి, తక్కువ స్థాయి పరిశోధనలకు పిహెచ్‌డి పట్టాలు, పారి శ్రామిక అనుసంధానం లేకపోవడం లాంటి అవాంఛనీయ వాస్తవాలు బాధను కలిగిస్తున్నాయి. ఇండియా ఆర్‌ అండ్‌ డి (పరిశోధనలు, అభివృద్ధి) విభాగంలో జీడీపీలో 0.7 శాతం ఖర్చు జరిగితే, అమెరికాలో 2.8 శాతం, చైనాలో 2.1 శాతం, ఇజ్రాయిల్‌లో 4.3 శాతం ఖర్చు చేయబడుతున్నది.
ప్రపంచ అత్యుత్తమ 1000 విశ్వవిద్యాలయాలలో ఇండి యాకు చెందిన 50 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉండ డం ఆశ్చర్యాన్నే కాదు బాధను కలిగిస్తున్నది. ఉత్తమ ప్రమా ణాలతో ఉన్నత విద్యను, సద్గుణ సంపదలను, వివేకాన్ని, ఉద్యోగ సాధన నైపుణ్యాలను కలిగి యువ భారతమంతా సౌభాగ్య భారతిని నిర్మించడంలో సఫలం కావాలని ఆశిద్దాం.
– బీఎంఆర్‌