– కోవిడ్ సమయంలో ఛిద్రమైన బతుకుల సంగతేంటి?
– ‘పేదరికం’పై వాస్తవాలను విస్మరించిన నిటి ఆయోగ్
న్యూఢిల్లీ : దేశంలో పేదరికం తగ్గిపోయిందా? అవునట. నిటి ఆయోగ్ గత నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015-16లో 24.85 శాతంగా ఉన్న పేదరికం 2019-21 నాటికి గణనీయంగా… అంటే 14.96 శాతానికి తగ్గిపోయిందట. అయితే గత కొన్ని సంవత్సరాలు గా వివిధ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలను, గణాంకాలను పరిశీలిస్తే నిటి ఆయోగ్ నివేదికపై అనుమానాలు తలెత్తడం సహజం. పైగా నిటి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ఏం చెప్పిందంటే అత్యంత నిరుపేద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌లో కూడా పేదరికం తగ్గిపోయిందట.
ఈ నివేదిక ప్రకారం గడచిన ఐదు సంవత్సరాలలో దేశంలోని 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు. ఇదే నిజమైతే 2030 నాటికి నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యం దిశగా దేశం సాగుతున్నట్లే. పురుషులు, మహిళలు, చిన్నారులు… వారు ఏ వయసువారైనప్పటికీ ప్రజానీకంలో సగం మందిని 2030 నాటికి పేదరికం నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వాస్తవానికి కోవిడ్ కష్టకాలంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమై పోయాయి. పట్టణాలు, నగరాలలో ఉపాధి కోల్పోయిన ప్రజలు గ్రామాల బాట పట్టి వందలాది కిలోమీటర్లు నడిచి, రాష్ట్రాలను దాటి స్వస్థలాలకు చేరుకున్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత వారు మళ్లీ పట్టణాలు, నగరాలకు చేరుకొని జీవనోపాధి కోసం ప్రయత్నించారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే పేదల బతుకులు ఛిద్రమైన ఆ సమయంలో సైతం దేశంలో పేదరికం తగ్గిందని నిటి ఆయోగ్ చెబుతోంది.
కోవిడ్ సమయంలో…
2020-21కి సంబంధించిన సమాచారాన్ని 2020 జనవరి నుంచి 2021 ఏప్రిల్ మధ్యకాలంలో సేకరించారు. ఈ సమయంలోనే కోవిడ్ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ కాలంలోనే పేదలు పెద్ద ఎత్తున పట్టణాలు, నగరాల నుంచి గ్రామాలకు వలస పోయారు. ప్రజలు అనారోగ్య కారణాలతో వైద్యం పైన ఎక్కువ సొమ్మును ఖర్చు చేయాల్సి వచ్చింది. కోవిడ్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌తో చిన్న చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. కొన్ని ఇప్పటికీ ప్రారంభం కాని పరిస్థితి. కొందరైతే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి వ్యాపారాలు మొదలు పెట్టారు. పరిశ్రమలు మూతపడడం అంటే యజమానులే కాదు వాటిలో పని చేసే కార్మికులు కూడా ఉపాధి కోల్పోయినట్లే. ధనికులైనా, పేదలైనా విద్యార్థుల చదువులు అటకెక్కాయి. విద్యా సంస్థలను మూసేశారు. ఆన్‌లైన్ క్లాసులతో నెట్టుకొచ్చారు. కానీ అవి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయాయి. గ్రామీణ ప్రాంతాలకు తల్లిదండ్రులతో పాటే వలస పోయిన విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2020-21లో పేదల ఆదాయాలు, ఉపాధి, విద్య, ఆరోగ్య ప్రమాణాలకు గట్టి విఘాతం ఏర్పడింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉంటే పేదరికం తగ్గిపోయిందని చెబుతున్న నిటి ఆయోగ్ నివేదికను ఎలా విశ్వసించగలం?
ఎలా నిర్ణయిస్తారు?
ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు అనే మూడు అంశాలను ఆధారంగా చేసుకొని పేదరిక సూచికను రూపొందిస్తారు. ఈ మూడింటికి సమాన ప్రాధాన్యత ఇస్తారు. ఈ మూడు అంశాలను తిరిగి 12 సూచికలుగా విభజిస్తారు. వీటలో మూడు ఆరోగ్యానికి, రెండు విద్యకు, ఏడు జీవన ప్రమాణాలకు సంబంధించినవి. కోవిడ్ రాక ముందే అంటే 2019-20లోనే 70% సమాచారాన్ని సేకరించామని నిటి ఆయోగ్ తెలిపింది. ఇదే నిజమైతే 2019-20 సమాచారంతో 2015-16 సమాచారాన్ని పోల్చి చూడాల్సింది. కానీ మరి ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైన అసాధారణ కాలంతో ఎందుకు పోల్చారు? అధికారిక గణాంకాల ప్రకారమే 2019-20లో ఉన్న జీడీపీ (4.8 శాతం) 2022-23 నాటికి కానీ తిరిగి ఆ స్థాయికి చేరుకోదు. అంటే మూడు సంవత్సరాల అభివృద్ధిని దేశం కోల్పోయింది. ఆర్థికాభివృద్ధి పది శాతం పడిపోయింది. కోవిడ్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత సంఘటిత రంగం సంక్షోభం నుంచి కోలుకుంది. కానీ పేదలు ఎక్కువగా పని చేసే అసంఘటిత రంగం మాత్రం నిదానంగా కోలు కుంటోంది. అయితే ఈ వాస్తవాన్ని నిటి ఆయోగ్ విస్మరించింది.
అంచనాలలో లోపాలు
నిటి ఆయోగ్ నివేదిక విశ్వసనీయతపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. 2011 నాటి జనగణనకు సంబంధించిన నమూనాలలో ఇటీవల చేసిన ప్రధాన మార్పులను ఈ నివేదిక పట్టించుకోలేదని వారు ఎత్తిచూపారు. పైగా 2012 తర్వాత ప్రభుత్వం వినియోగ సర్వే చేపట్టలేదు. దీనివల్ల ప్రభుత్వం పేదరికాన్ని సరిగా అంచనా వేయలేకపోయింది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన 28 కోట్ల మంది కార్మికులలో 94 శాతం మంది తమ నెలసరి వేతనం పది వేల రూపాయల కంటే తక్కువేనని డిక్లరేషన్ ఇచ్చారు. అంటే అసంఘటిత రంగంలో పని చేస్తున్న చాలా మంది కార్మికులు దారిద్య్ర రేఖకు సమీపంలోనే ఉన్నారని అర్థమవుతుంది. ఆరోగ్యం, విద్య సూచికలలోనే కాదు… అనేక ఇతర అంశాలలో కూడా కోవిడ్ కాలంలో పేదల బతుకులు చిన్నాభిన్నమైపోయాయి.