కాంతులీనే చర్మానికి

Cantuline skinచర్మం ప్రకాశవంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు ఏవేవో లోషన్లలని, ఫౌండేషన్స్‌లని వాడుతూ ఉంటారు. అలా కాకుండా సహజ సిద్ధంగా ప్రయత్నించే కొన్ని చిట్కాలు చర్మానికి సహజ కాంతిని అందిస్తాయి. మరి అవేంటో తెలుసుకుందామా..!
అర చెంచా పసుపు, నాలుగు చెంచాల పాలను ఓ గిన్నెలో కలపండి. దీన్ని ముఖం, మెడ చుట్టూ రాసుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే… మెరిసే చర్మం మీ సొంతం.
క్యారెట్‌ జ్యూస్‌ తీసి అందులో కొద్దిగా తేనె, కొద్దిగ పుల్లటి పెరుగు కలిపి ముఖానికి రాయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. చర్మం మెరుస్తూ… మృదువుగా అవుతుంది. వారానికి ఓసారి ఇలా చెయ్యండి.
చెంచా నిమ్మరసం, చెంచా చక్కెర కలిపి ముఖంపై గుండ్రంగా రుద్దుతూ మసాజ్‌ చేసుకోండి. చక్కెర కరిగిపోగానే ముఖాన్ని నీటితో కడిగేయండి. తేడా మీకే తెలిసిపోతుంది.
చెంచా బొప్పాయి జ్యూస్‌, దోసకాయ జ్యూస్‌ రెండు చెంచాలు, ఓ అరటిపండులో సగం జ్యూస్‌గా తీసుకుని, అన్ని కలిపి పేస్టులా రాసుకోవాలి. అరగంట తర్వాత కడిగేయండి.
రోజ్‌ వాటర్‌ను అరగంట పాటూ ఫ్రిజ్‌లో ఉంచాలి. అందులో దూదిని ముంచి దాంతో ముఖానికి మసాజ్‌ చేసుకోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం వేళ ఇలా చేస్తే చాలా మంచిది. రోజ్‌ వాటర్‌ని ఐస్‌ ముక్కలుగా మార్చి ఆ ముక్కలను రుద్దుకున్నా మంచిదే.
ఓ చెంచా కమలా పండు తొక్క గుజ్జు, ఓ చెంచా రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
చెంచా కలబంద గుజ్జు, చెంచా తేనె, చెంచా పాలు కలిపి ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
చెంచా తినేసోడా, చెంచా తేనె, అర చెంచా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.