నవతెలంగాణ – బంజారాహిల్స్
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భూ వ్యవహారం విషయంలో ఇంద్రపాల్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసును ఫిలింనగర్ పోలీసులకు బదిలీ చేశారు. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. 2018లో ఫిలింనగర్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఓ స్థలం కొనుగోలు చేసేందుకు సామ ఇంద్రపాల్ ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి ఆయనకు మధ్యవర్తులుగా పరిచయమయ్యారు. మరో వ్యక్తితో కలిసి రూ.3.65 కోట్లకు భూమి అమ్ముతామన్నారు. ఇందుకోసం కమీషన్ ఇవ్వాలని కోరగా ఇంద్రపాల్ సైతం అంగీకరించాడు. ఈ మేరకు అదే ఏడాది మేలో రూ.90 లక్షలు చెల్లించాడు. అనంతరం విడతల వారీగా మొత్తం రూ.3.05 కోట్లు ముట్టజెప్పాడు. మిగతా రూ.60 లక్షల కోసం లోన్‌కు అప్లై చేశానని.. అది రాగానే చెల్లిస్తానని చెప్పాడు. అయితే అది ఆలస్యం అవుతోందని ఎమ్మెల్యే తరఫు అనుచరులు ఇంద్రపాల్‌పై బెదిరింపులకు దిగారు. ఓ గదిలో అతన్ని ఉంచి టార్చర్ చేసినట్టు బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి బారి నుంచి తప్పించుకొని ఇంద్రపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా వివిధ మార్గాల్లో తరచూ తనను బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. అనంతరం ఇంద్రపాల్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పట్నం నరేందర్రెడ్డి, రాకేశ్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఈ కేసును ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.