కేసులు, నిర్బంధాలు ఎదుర్కుంటూ నిబద్ధతతో పోరాటాలు

నిరుపేద కుటుంబంలో పుట్టిన కామ్రేడ్‌ భూక్య వీరభద్రం విద్యార్థి దశ నుంచే ఎర్ర జెండా పట్టి పార్టీ సిధ్ధాంతం, ఆశయాల సాధన కోసం నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యల పైన నికరంగా నిలబడి పోరాటం చేస్తున్నారు. ప్రజా ఉద్యమాల పోరు బాటలో కేసులూ, నిర్బంధాలను ఎదుర్కుంటూ నిజాయితీ, నిబద్ధతతో రైతులు, గిరిజనులు, మహిళలు, ప్రజల సమస్యలపైన, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పైన అలుపెరుగని పోరాటం చేస్తున్నా ఎర్ర జెండా ముద్దు బిడ్డ భూక్య వీరభద్రం. 2018 ఎన్నికల్లో సిపిఐ(ఎం) అభ్యర్థిగా వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఒక్క రూపాయి కూడా పంచకుండా సుమారు 12000 ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గం అభ్యర్థిగా రెండోవ సారి పోటీ చేస్తున్న కామ్రేడ్‌ భూక్యా వీరభద్రం గురించి స్పెషల్‌ స్టోరీ.

– సీపీఐ(ఎం) వైరా అభ్యర్థి భూక్య వీరభద్రం
నవతెలంగాణ-వైరాటౌన్‌
ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్‌ మండలం, కస్నాతండా గ్రామంలోని నిరుపేద రైతు కుటుంబంలో భూక్య వీరభద్రం జన్మించారు. సిపిఐ(ఎం) సీనియర్‌ నాయకులు సామ్యా నాయక్‌ (75), కమలమ్మ (70) దంపతులకు భూక్యా వీరభద్రం నాల్గవ సంతానంగా జన్మించారు. భూక్యా వీరభద్రానికి ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిదండ్రులు తమకున్న 1.30 ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ వ్యవసాయ కూలీ పనులకు చేసుకుంటూ పిల్లలను కష్టపడి చదివించారు. తండ్రి సామ్యా నాయక్‌ చిన్నపుడు దాదాపు 16 సంవత్సరాల పాటు జీతం చేశారు. 20 సంవత్సరాల పాటు సిపిఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి పని చేశారు. ప్రస్తుతం సిపిఐ(ఎం) సీనియర్‌ సభ్యులుగా కొనసాగుతున్నారు. తండ్రి స్ఫూర్తితో భూక్యా వీరభద్రం పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పని చేస్తున్నారు. తమ్ముడు భూక్యా నాగేశ్వరరావు ప్రస్తుతం కస్నాతండా సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి, ఖమ్మం రూరల్‌ మండల కమిటీ సభ్యులుగా పని చేస్తున్నారు. భుక్యా వీరభద్రం భార్య విజయ గృహిణి, కూతుర్లు సృజన బిటెక్‌, ఉషశ్రీ ఇంటర్‌ చదువుతున్నారు.
స్ఫూర్తినిచ్చిన కమ్యూనిస్టు నాయకులు
పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి రాంకిషన్‌ రావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, కేఎల్‌. నరసింహారావు, ఏలూరి లక్ష్మీనారాయణ, కంగాల బుచ్చయ్య తదితర నాయకుల స్ఫూర్తితో నిరాడంబర జీవితం గడుపుతూ నిరంతరం ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు.
సీపీఐ(ఎం)లో నిర్వహించిన బాధ్యతలు
1999 నుండి 2002 వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం డివిజన్‌ కార్యదర్శిగా, సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్‌ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2003 నుండి 2008 వరకు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. 2009 నుండి నేటి వరకు గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2008 నుండి సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యునిగా కొనసాగుతూ ప్రస్తుతం ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, వైరా నియోజకవర్గం పార్టీ ఇన్చార్జిగా, పోడు భూముల పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ గా పనిచేస్తున్నారు.
ప్రజా ఉద్యమాలు, పోరాటాలలో కీలక పాత్ర.
భూక్య వీరభద్రం 2000లో జరిగిన విద్యుత్‌ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బంజారా పోరుబాట పాదయాత్రలో 60 రోజుల పాటు 500 తండాల్లో 1261 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించారు. 2006లో జరిగిన ఇళ్ల స్థలాలు భూ పోరాటంలో, 2007లో కొణిజర్ల మండలంలో జరిగిన పోడు ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఈ ఉద్యమాల ద్వారా గిరిజన పేదలకు వందల ఎకరాల భూములు దక్కాయి. వైరా నియోజ కవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోడు భూములపై చేస్తున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా 10 రోజులపాటు మండుటెండలో 250 కిలోమీటర్లు పోడు భూముల పరిరక్షణ పాదయాత్ర నియోజకవర్గ వ్యాప్తంగా చేశారు. వైరా నియోజకవర్గంలో నకిలీ మిర్చి విత్తన బాధిత రైతులకు అండగా నిలబడి ఉద్యమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం వైరా నియోజకవర్గంలో 4000 మంది రైతులకు వర్తించలేదని, రైతులందరికీ రుణమాఫీ చెయ్యాలని రైతులతో కలిసి మండల స్థాయి నుండి రాష్ట్రస్థాయి ఉద్యమాన్ని నిర్మించారు. హక్కుపత్రాలు కలిగిన గిరిజనులకు బ్యాంకు రుణాల కోసం ప్రత్యేక ఉద్యమం చేపట్టి ఏన్కూరు, కారేపల్లి, జూలూరుపాడు, కొణిజర్ల మండలాలలో వందలాది రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించారు. 2022-23 సంవత్సరంలో సిపిఐ(ఎం), వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ప్రజాపంథా, కాంగ్రెస్‌, టిడిపి గిరిజన సంఘాలను కలుపుకొని పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం పైన పోడు రైతుల పొలికేక సభలు, రహదారుల దిగ్బంధం చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పోడు రైతులకు హక్కు పత్రాలు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. పోడు రైతులకు అండగా నిలబడ్డారు. పోడు హక్కు పత్రాలు సాధించిన కారేపల్లి మండలం చీమలపాడు ప్రాంతం రైతులకు ఇల్లందు యూనియన్‌ బ్యాంక్‌ రుణాలు ఇవ్వకుండా తిరస్కరిస్తే వందలాది మంది రైతులను సమీకరించి బ్యాంకును ముట్టడించి కొత్తగా ఇచ్చిన హక్కు పత్రాల పైన రుణాలు ఇప్పించిన చరిత్ర భూక్యా వీరభద్రంకు ఉన్నది. వైరా ఆయకట్టు రైతులకు సాగు నీళ్ల కోసం ప్రణాళిక బద్ధంగా ఉద్యమం ద్వారా నీళ్లు సాధించడంలో భాగస్వామ్యం వహించారు. కారేపల్లి మండల కేంద్రం పోడు ఉద్యమానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించి ప్రభుత్వం, ఫారెస్ట్‌ అధికారుల పైన పోరాడి పేదల జోలికి రాకుండా ప్రభుత్వం ద్వారా రాతపూర్వకంగా హామీని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో 2005-06లో ఖమ్మంలో ఇంటర్‌, డిగ్రీ గిరిజన విద్యార్థులకు ఎస్‌ఎం హాస్టల్స్‌ సొంత భవనాలు ఏర్పాటుకై కలెక్టరేట్‌ ముందు నిరాహార దీక్షలు చేసి హాస్టల్స్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
కేసులు – నిర్బంధాలు ఎదుర్కుంటూ ప్రజా ఉద్యమాలు.
2000లో విద్యుత్‌ ఉద్యమం సందర్భంగా నాన్‌ బెయిలబుల్‌ కేసులో వరంగల్‌ సెంట్రల్‌ జైలులో 18 రోజులు, 2006 ఇళ్ల స్థలాలు భూ పోరాట ఉద్యమంలో వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో 22 రోజులు, 2007-08 మేకాలకుంట, విక్రమ్‌ నగర్‌ లలో జరిగిన పోడు ఉద్యమం సందర్భంగా రెండుసార్లు ఖమ్మం జైలులో 30 రోజులు నిర్బంధించబడ్డారు. 2011-12 విక్రమ్‌ నగర్‌, గుబ్బగుర్తి ప్రాంతాలలో పోడు ఉద్యమం జరిగిన సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పిడి యాక్ట్‌ పెట్టి చర్లపల్లి జైల్లో ఆరు నెలలపాటు నిర్బంధించారు. ఈ సందర్భంగా ఎల్లన్ననగర్‌ దగ్గర ఫారెస్ట్‌, పోలీస్‌, రెవిన్యూ అధికారులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి, విష ప్రయోగం ద్వారా భూక్యా వీరభద్రంను చంపే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అనేక సందర్భాలలో గిరిజన హక్కుల కోసం జరిగిన పోరాట ఉద్యమాలలో అక్రమ కేసులు బనాయించారు.
చైతన్యంతో ఆలోచించి సీపీఐ(ఎం)కు ఓటు వేయండి
నేటి సమాజంలో చట్టసభలలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం చాలా ఉన్నది. ప్రజల పక్షాన నికరంగా నిలబడి నిజాయితీగా పోరాటం చేస్తున్న సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించాలి, ఓట్లు వేసి గెలిపించాలి. అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుంది. వైరా నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చైతన్యంతో ఆలోచించి సిపిఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రంకు ఓట్లు వేసి గెలిపించాలి.