రైతుల ఖాతాల్లోనూ నగదు జమ చేయాలి

– సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతు రుణమాఫీ పథకంలో భాగంగా పంటరుణాలు పూర్తిగా చెల్లించిన వారికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతుల ఖాతాల్లో నగదును జమ చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమంలో పంటరుణాలను తీసుకుని, పూర్తిగా చెల్లించిన వారికి రుణమాఫీ చేసినట్టు ట్రెజరీ ద్వారా బ్యాంక్‌లో నగదు పడినట్టు రైతుల ఫోన్‌కు సమాచారం వచ్చినట్టు తెలుస్తున్నదని తెలిపారు. పంటరుణాలు కట్టిన వెంటనే సంబంధిత ఖాతా రద్దు చేయబడుతున్నదనీ, ఆ ఖాతాలో ఎలాంటి నగదు జమ కాలేదంటూ బ్యాంక్‌ అధికారులు ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ట్రెజరీ ద్వారా నగదు చెల్లించినట్టు సమాచారం ఇస్తున్నారని వివరించారు. రుణమాఫీ విధివిధానాల ప్రకారం పంటరుణాలు చెల్లిస్తే రుణమాఫీ నగదు పూర్తిగా ఇవ్వనున్నట్టు చెప్తున్నారని తెలిపారు. కానీ రైతులకు రుణమాఫీ డబ్బులు పడకపోవడం, ట్రెజరీ ద్వారా చెల్లించినట్టు సమాచారం రావడంతో వారు తీవ్ర ఆయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. పంటరుణాల అకౌంట్‌ రద్దు చేసిన వారి వ్యక్తిగత అకౌంట్‌కు రుణమాఫీ నగదు ఇవ్వొచ్చని సూచించారు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయో సంబంధిత అధికారులకూ తెలియకపోవడం అన్యాయంగా ఉందని విమర్శించారు. పంటరుణాలు చెల్లించిన వారికి రుణమాఫీ నగదు వేయడంలో జరిగిన గందరగోళ పరిస్థితులపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరారు.