ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష…

– ఆత్మహత్యలకు పాల్పడుతున్న దళిత విద్యార్థులు
– హార్వర్డ్‌, జాన్స్‌ హాప్‌కిన్స్‌ వర్సిటీలు దీనికి భిన్నం
న్యూడిల్లీ : 2005లో బాంబే ఐఐటీలో విజరు నూకల అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం నేపథ్యంలో ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక ఓ నివేదికను ప్రచురించింది. ఉన్నత విద్యా సంస్థలలో కుల వివక్ష ఎలా జడలు విప్పుతోందో ఆ నివేదిక బట్టబయలు చేసింది. విజరు ఆత్మహత్య ఉదంతం తర్వాత ఆధునిక భారతావని వదనంపై ఏర్పడిన గాయాలు పెద్దవై పోతూనే ఉన్నాయి. ఐఐటీ బాంబేలోనే దర్శన్‌ సోలంకి అనే దళిత విద్యార్థి జీవితం విషాదాంతం కావడం వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ఉన్నత విద్యా సంస్థలు ఒకప్పుడు విద్యార్థులకు స్వర్గధామం లా కన్పించేవి. వాటిలో సీటు దొరికితే చాలు… చిరకాల స్వప్నాలను సాకారం చేసుకోవచ్చునని వారు ఆశించేవారు. కానీ ఇప్పుడో? ఆ సంస్థలలో అంతా అనిశ్చితి…భయానక వాతావరణం. ముఖ్యంగా దళిత విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగించాల్సి వస్తోంది.
2014-2021 మధ్యకాలంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌సీలు, ఇతర కేంద్ర యూనివర్సి టీలు వంటి ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్న 122 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2021లో లోక్‌సభకు తెలిపింది. వీరిలో సగం మంది దళిత బిడ్డలే. విద్యాలయాలలో ప్రవేశించిన కుల రక్కసి కోరలలో చిక్కి వీరంతా బలయ్యారు. కుల పక్షపాతం అనేది క్యాన్సర్‌లా వ్యాపించి సరస్వతీ మందిరాలను దహించివేస్తోంది.
అనికెత్‌ అంభోర్‌ నుండి దర్శన్‌ సోలంకీ వరకూ అందరూ ఈ వివక్షకు గురై ప్రాణా లు విడిచిన వారే. విద్యా సంస్థల నుండి కుల భూతా న్ని తరిమేయడంలో వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఫలితంగా ఎందరో విద్యార్థుల మేథస్సు ఎవరికీ పనికిరాకుండా పోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటు న్నారు. ఈ బలవన్మరణాల వెనుక అన్నీ కన్నీటి కథలే…వ్యథలే. వీరిని కాపాడుకోవడంలో సమాజం దారుణంగా విఫలమవుతోంది.
ఆ వర్సిటీల తీరే వేరు
ఐఐటీలతో పోలిస్తే హార్వర్డ్‌ యూనివర్సిటీ, జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీలు విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో ఎంతో ముందడుగు వేశాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాలు విద్యార్థుల మానసిక ఆరోగ్య అంశాలకు పెద్ద పీట వేశాయి. తమ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా నిరోధించాయి. విద్యార్థుల బాగోగులు చూసే విషయంలో వీటికి మంచి పేరుంది. ఐఐటీలలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. అక్కడ విద్యార్థుల బాగోగులను పట్టించుకునే వారే ఉండరు. అసలు అధ్యాపకులకే ఆ సోయి ఉండదు. హార్వర్డ్‌, జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీలలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం వర్క్‌షాపులు, పలు కార్యక్ర మాలు నిర్వహిస్తారు. స్వేచ్ఛగా చర్చించుకునేందుకు అవకాశం ఇస్తారు. అవసరమైన విద్యార్థులకు మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తారు. కౌన్సిలింగ్‌ ఇవ్వడం, మానసిక నిపుణులతో మాట్లాడించడం వంటి సమగ్ర ఆరోగ్య సేవలు అందిస్తారు.
ఐఐటీలలో ఇలాంటివి మచ్చుకైనా కానరావు. సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు విద్యార్థులకు అవసరమైన మద్దతు ఆ సంస్థలతో లభించదు. హార్వర్డ్‌, జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సి టీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటే ఐఐటీలు కూడా విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. తద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపి ఆత్మహత్య ప్రయత్నాల నుండి వారిని దూరం చేయవచ్చు.