– తెలంగాణ లో సీ.డీ.బీ ఏర్పాటు చేయాలి – మాజీమంత్రి తుమ్మల డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ లో ఉద్యాన పంటల లో రెండో స్థానంలో కొబ్బరి సాగు ఉన్నందున ఈ ప్రాంతంలో కొబ్బరి అభివృద్ది బోర్డు ను ఏర్పాటు చేసి ఈ సాగు పెంపుదల పై రైతులకు చేయూత ఇవ్వాలని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోకోనట్ డెవలప్ మెంట్ బోర్డ్( సీడీ బీ ) డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్ ను కోరారు. తెలంగాణ విభజన అనంతరం మొదటి సారిగా ఈ బోర్డ్ డీడీ కుమార్ వేల్ మంగళవారం ఇక్కడి కొబ్బరి క్షేత్రాలను పరిశీలించడానికి వచ్చారు.ఈ సందర్భంగా ఆయన ముందుగా అశ్వారావుపేట మండలంలో గల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొబ్బరి క్షేత్రాన్ని పరిశీలించారు.కొబ్బరి సాగులో మెలుకువలు,యాజమాన్య పద్ధతులను తుమ్మల అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రాంతంలో కోకోనట్ అభివృద్ది బోర్డ్ ఏర్పాటుకు గల కార్యాచరణను సంస్థ ఉన్నతాధికారులతో ఆయన సమక్షంలోనే మాట్లాడారు.వెంటనే కార్యాలయం ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం డీడీ కుమార్ వేల్ అశ్వారావుపేట లో గల కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రాన్ని,ఉద్యాన పరిశోధనా స్థానాన్ని సందర్శించారు.దమ్మపేట మండలంలో గల ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,రైతు బంధు జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు కొబ్బరి క్షేత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీ.డీ.బీ స్టేట్ ఫీల్డ్ ఆఫీసర్ ఎం.కిరణ్ కుమార్,కొబ్బరి సాగుదారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆలపాటి రామ్మోహన్ రావు(రాము),కొక్కెరపాటి పుల్లయ్య,తుంబూరు మహేశ్వర రెడ్డి,తలశిల ప్రసాద్,పసుపులేటి ఆదినారాయణ,నున్న క్రిష్ణ,అల్లూరి బుజ్జి లు పాల్గొన్నారు.