– తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఐ(ఎం) ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు భిన్నంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (సీఈసీి) నియామకాల్లో కేంద్ర పెత్తనాన్ని జొప్పిస్తూ మోడీ సర్కార్ మరో దుర్మార్గమైన బిల్లును ముందుకు తెచ్చింది. సీఈసీల (నియామకం, సర్వీస్ నిబంధనలు, పదవీ కాలం) బిల్లును గురువారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు సిఇసి, ఇసి నియామకాల కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్నారు. అయితే సీజేఐ స్థానంలో ప్రధానమంత్రి ప్రతిపాదించే కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారని తాజా బిల్లులో ప్రతిపాదించారు. ప్రతిపాదిత బిల్లు చట్టంగా మారితే సీజేఐ స్థానంలో కేంద్రమంత్రి సభ్యులుగా ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాల్సి వుంటుంది. కేంద్రం ప్రతిపాదించిన బిల్లుతో ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ బిల్లును సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు ప్రతిపక్ష ఎంపిలంతా మద్దతు తెలిపారు. ఛైర్మన్ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు హోరెత్తించారు. దీంతో సభను వెంటనే చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ శుక్రవారానికి వాయిదా వేశారు.