ఐఐపీఎస్‌ డైరెక్టర్‌పై కేంద్రం వేటు

– మోడీ సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్న సర్వేలు
– వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్న వైనం
న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాప్యులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) డైరెక్టర్‌ కేఎస్‌ జేమ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ మోడీ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. నియామకాలలో అవకతవకలు జరిగాయని,అందుకే సస్పెన్షన్‌ వేటు వేశామని సాకు చెప్పింది. ఐఐపీఎస్‌ సంస్థ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు తయారు చేయడం, ప్రభుత్వం నిర్దేశించే ఇతర పనులు చేపట్ట డం దాని పని. జేమ్స్‌కు శుక్రవారం సాయంత్రం సస్పెన్షన్‌ లేఖ పంపారని అధికార వర్గాలు ధృవీకరించాయి. జేమ్స్‌ సస్పెన్షన్‌కు ప్రభుత్వం చెబుతున్న కారణం ఏదైనా వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. ఐఐపీఎస్‌ గతంలో చేసిన సర్వేలలో వెల్లడైన అంశాలపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేయాల్సిందిగా ఆయనను కోరింది. అయితే అందు కు జేమ్స్‌ నిరాకరించారని తెలుస్తోంది.2018లో ముంబయి కేంద్రంగా ప్రార ంభించి న ఐఐపీఎస్‌కు జేమ్స్‌ను డైరెక్టర్‌గా నియమించారు. ఆ సంస్థకు మం చి గుర్తింపు లభించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. హార్వర్డ్‌ సెంటర్‌ నుండి పోస్ట్‌ డాక్టరల్‌ డిగ్రీ (జనాభా-అభివృద్ధి) పొందిన జేమ్స్‌ గతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఐఐపీఎస్‌లో చేరకముందు ఆయన అనేక నాయకత్వ బాధ్యతలు సైతం నిర్వర్తించారు.
ఇబ్బంది పెట్టిన సర్వేలు
ఐఐపీఎస్‌ నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 సర్వేలో బయటపడిన వాస్తవాలు ప్రభుత్వానికి అసౌకర్యాన్ని కలిగించాయి. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన జరగని దేశంగా భారత్‌ను ప్రధాని మోడీ 2019 అక్టోబర్‌ 2న ప్రకటించారు. అయితే సర్వేలో దానికి విరుద్ధమైన సమాచారం లభించింది. దేశంలోని 19% కుటుంబాలు ఇప్పటికీ బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేస్తున్నారని ఆ సర్వేలో తేలింది.
ఒడిషా, జార్ఖండ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలలో 30% జనాభాకు మరుగుదొడ్లే లేవని తేల్చేసింది. గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నదని, బీహార్‌లో దాదాపు సగం మందికి మరుగుదొడ్లే లేవని కఠోర సత్యాన్ని బయటపెట్టింది. పౌష్టికాహార సూచికలను మెరుగుపరచేందుకు మోడీ ప్రభుత్వం 2018లో ప్రారంభించిన ‘పోషణ్‌ అభియాన్‌’ పథకం పనితీరు కూడా పేలవంగానే ఉన్నదని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 సర్వే నిగ్గు తేల్చింది. 2015-16తో పోలిస్తే 2019-21 మధ్యకాలంలో పిల్లలలో రక్తహీనత పెరిగిందని తెలిపింది.
మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చేయించిన వినియోగ వ్యయ సర్వే కూడా విమర్శలకు గురైంది. ఈ సర్వే ఫలితాలతో ప్రభుత్వం విభేదించింది. ఆ తర్వాత 2019 జనవరిలో వచ్చిన నిరుద్యోగ సమాచారాన్ని కూడా పక్కనపెట్టి దానిని ఎన్నికలు ముగిసిన తర్వాతే విడుదల చేసింది. ప్రభుత్వ చర్యకు నిరసనగా జాతీయ గణాంకాల కమిషన్‌ తాత్కాలిక ఛైర్మన్‌ పీసీ మోహనన్‌ సహా పలువురు సభ్యులు రాజీనామా చేశారు. పది సంవత్సరాలకు ఒకసారి చేయాల్సిన జనగణనను కూడా ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. నూట యాభై సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా జనగణన వాయిదా పడడం గమనార్హం.ఏదేమైనా సర్వేలలో బయటపడుతున్న వాస్తవాలను బహిర్గతం చేయకుండా తొక్కిపట్టడం వల్ల ప్రభుత్వ విశ్వసనీయత పైన, చిత్తశుద్ధి పైన అనుమానాలు తలెత్తుతున్నాయి. విధానపరమైన నిర్ణయాల పైన ప్రభావం పడితే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయే ప్రమాదమూ ఉంది.