కనీస మద్దతు ధరలో రైతులకు కేంద్రం మళ్ళీ మోసం….

-తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతులు కష్టపడి పండించిన పంటలకు ఉత్పత్తి ఖర్చులు కంటే తక్కువగా మద్దతు ధరలు ప్రకటించి రైతులకు మోడీ ప్రభుత్వం మళ్ళీ మోసం చేసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  టి సాగర్ విమర్శించారు. స్థానిక లహరి ఫంక్షన్ హాల్ లో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో రెండో రోజు గురువారం ఆయన “రైతు సంఘ నిర్మాణం” అనే అంశం పై బోధించారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల్లో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా సి 2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ప్రామాణికాల్లో ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు.ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారకాలు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సాగు ఖర్చులు రైతన్నకు గుదిబండగా మారాయి అన్నారు.అకాల వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తులు మోసుకొచ్చే నష్టాలు చెప్పనలవికావు అని ఆవేదన వ్యక్తం చేసారు.ఇ – క్రాప్‌ వంటి డిజిటల్‌ చిక్కుముడులుతో పంటలకు అందాల్సిన బీమా సైతం అందకుండా రూ.కోట్లాది ప్రీమియం సొమ్ము కార్పొరేట్‌ గల్లా పెట్టెలు చేరుతోందే తప్ప అన్నదాతకు ఊరడింపు దక్కడం లేదన్నారు.విత్త సంస్థల నుంచి రుణ సాయం కూడా ఎండ మావిలో నీటి చెమ్మ తీరునే తలపిస్తోందని తెలిపారు. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న రైతన్నకు నామమాత్రపు ఎం.ఎస్‌.పి తో ప్రోత్సహం దక్కక పోగా కన్నీరే మిగులుతోంది అని విచారం వ్యక్తం చేసారు.కేంద్ర ప్రభుత్వ చర్యలు రైతులను ప్రత్యేకించి చిన్న,సన్నకారు రైతులను పచ్చి దగా కు గురిచేస్తున్నాయి అని ఎద్దేవా చేసారు.వరికి క్వింటాల్ కు సి 2 + 50% ఫార్ములా ప్రకారం  రూ.2,866 లు ప్రకటించాలని,కానీ ప్రభుత్వం మద్దతు ధర రూ.2,183 ప్రకటించిందని, దీనివల్ల రైతులకు రూ.683 నష్టమని చెప్పారు.వేరు శనగకు సి 2+50% ప్రకారం రూ. 8025 ప్రకటించాల్సి ఉందని, కానీ ప్రభుత్వం రూ.6,377 ప్రకటించిందని తెలిపారు. దీనివల్ల క్వింటాల్ కు రైతులు రూ.1,648 నష్టపోతున్నారని అన్నారు. మొక్క జొన్నకి  రూ. 2,695 ప్రకటించాల్సి ఉండగా, ప్రభుత్వం రూ. 2,090 ప్రకటించిందని, దీనివల్ల రైతులకు క్వింటాల్ కు రూ.605 నష్టం జరుగుతుందని అన్నారు. పత్తికి రూ.8,679 ప్రకటించాల్సి ఉందని, కానీ ప్రభుత్వం రూ.6,620 ప్రకటించిందని, దీనివల్ల క్వింటాల్ కు రూ.2059 నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు పెట్టుబడులను కావాలనే సి.ఎ.సి.పి తక్కువగా చూపి..జాతీయ సగటు కంటే అధికంగా ఎం.ఎస్‌.పి ఇచ్చామంటూ ప్రచారం చేస్తుండటం మోడీ ప్రభుత్వం నయవంచనకు నిదర్శనం. దేశానికి అన్నం పెట్టే రైతన్నను వంచించడం కంటే దేశద్రోహం ఉండ్ఉండదు. మోడీ సర్కార్‌ ఇప్పటికైనా స్వామినాథనదుిషన్‌ ప్రతిపాదించిన సి 2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ప్రకారం ఎంఎస్‌పి ప్రకటించి చట్టబద్ధం చేయాలి. పదేపదే ఇదే ద్రోహానికి ఒడిగడుతున్న బిజెపిని సాగనంపేందుకు సాగుదార్లంతా సిద్ధం కావాలని అన్నారు. ఇంతకుముందు వ్యవసాయ పరిణామ క్రమం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య బోధించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి ప్రిన్సిపల్ గా వ్యవహరించారు.  కాసాని ఐలయ్య, మాదినేని రమేష్, వి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న,  సహాయ కార్యదర్శులు కందాల ప్రమీల, బోంతు రాంబాబు, డి బాల్ రెడ్డి, ఎం శ్రీనివాస్, బాలరాజు గౌడ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు యలమంచిలి వంశీ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.