గిరిజనుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం

Center for recording the rights of tribals– మంత్రి సత్యవతి రాథోడ్‌
– గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
నవతెలంగాణ- బంజారాహిల్స్‌
దేశంలో ఆదివాసుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. అయితే, దేశంలో ఎక్కడాలేని విధంగా ఆదివాసీల ప్రగతి తెలంగాణలో అద్భుతంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవనంలో బుధవారం ఆదివాసీ దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. గురుకులాల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, రూ.50వేలు, ఎంబీబీఎస్‌లో అర్హత సాధించిన వారికి రూ.50 వేలు, డెంటల్‌లో, ఆయుష్‌లో అర్హత సాధించిన వారికి రూ.40 వేల చెక్కులను, పురస్కారాలను అందజేశారు. వివిధ సామాజిక తరగతుల్లో సేవ చేసిన వారిని సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజనులందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఆదివాసీ గిరిజన తెగల అభివృద్ధి గతంలో జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. గిరిజన ఆదివాసీ తెగల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధులను కార్పొరేషన్‌ ద్వారా విడుదల చేస్తూ వారి అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. మళ్లీ తమ ప్రభుత్వమే ఏర్పాటువుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని బ్లాక్‌ మెయిల్‌ చేయడం రేవంత్‌కు అలవాటన్నారు. రేవంత్‌ రెడ్డియే కాంగ్రెస్‌కు ఘోరీ కడతారని ఆరోపించారు. తెలంగాణ వాదినని పదే పదే చెప్పుకుంటున్నారని.. ఆయన తెలంగాణ కోసం చేసిన గొప్ప పని ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు. 2018కన్నా ఘోరమైన పరిస్థితి 2023లో కాంగ్రెస్‌కు రాబోతుందన్నారు. గద్దర్‌ శాసనసభలో సభ్యుడు కాకున్నా సంతాపం తెలిపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకొని కౌన్సిల్‌లో కూడా సంతాపం తెలిపామన్నారు. గద్దర్‌ అందరి మనిషి అన్నారు. గద్దర్‌ కాంగ్రెస్‌ పార్టీ అయితే.. కేఏ పాల్‌ పార్టీలోకి ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు. కొత్త పార్టీ కోసం ఎన్నికల కమిషన్‌ దగ్గర ఎందుకు రిజిస్ట్రర్‌ చేసుకున్నారని అన్నారు. ఓట్ల కోసం గద్దర్‌ మరణాన్ని కాంగ్రెస్‌ రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, రెడ్యానాయక్‌, శంకర్‌ నాయక్‌, గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తు(ఐఏఎస్‌), గురుకులాల సెక్రటరీ డాక్టర్‌ ఈ నవీన్‌ నికోలస్‌, టీఎస్‌ఆర్‌, ఐటి డైరెక్టర్‌ సర్వేశ్వర్‌ రెడ్డి, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మెన్‌ రమావత్‌ వాలినాయక్‌, హైదరాబాద్‌ నగర డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత శోభన్‌ రెడ్డి, కార్పొరేటర్‌ మనీ కవితారెడ్డి పాల్గొన్నారు. గిరిజనులు, ఆదివాసీలు భారీ సంఖ్యలో పాల్గొని వారి కళలను ప్రదర్శించారు.