నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను అమలు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈ యూ ) ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి సీబీఐ కోర్టు, హైదరాబాద్ జిల్లా క్రిమినల్ కోర్టు ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ లోని నాంపల్లిలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, క్రిమినల్ కోర్టులో చలో హైదరాబాద్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ అధ్యక్షులు లక్ష్మారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై పాల్గొని మాట్లాడారు. ఈనెల 12న చలో హైదరాబాద్ కార్యక్రమంలో సీబీఐ కోర్టు, క్రిమినల్ కోర్టు ఉద్యోగులు కుటుంబాలతోపాటు పాల్గొంటారని చెప్పారు. పాత పెన్షన్‌లో ఉన్న న్యాయ శాఖ ఉద్యోగులు సైతం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల్లోపు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీయస్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కోటకొండ పవన్ కుమార్, నవీన్, హేమంత్, జ్ఞాన ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.