విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం

నవతెలంగాణ-పెద్దవంగర: విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని ప్రభుత్వ అధ్యాపకులు పాలకొండ లక్ష్మీనరసింహామూర్తి అన్నారు. అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన గ్రామ సర్పంచ్ సలిదండి మంజుల సుధాకర్, ఎస్ఎంసీ చైర్మన్ సంతోష్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అల్లందాసు బిక్షపతి అధ్యక్షతన ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చేందుకు విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు. పట్టుదలతో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, గొప్ప ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. తన తల్లిదండ్రుల స్మారకార్థం గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ జీపీఏ సాధించిన కొత్తగట్టు విగ్నేష్ కు రూ. 5 వేలు, కోట శివకుమార్ కు రూ. 3 వేలు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. అనంతరం విద్యార్థులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల విద్యార్థులకు తన తల్లిదండ్రుల స్మారకార్థం ప్రోత్సాహక బహుమతులు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్, రమేష్ కుమార్, రవి, శ్రీను, నరసింహారావు, రత్నం, సంతోష్ కుమార్, శ్రీనివాస్, సునీత రాణి, సునీత, గోవర్ధన్, సురేష్, రామతార, విద్యార్థులు పాల్గొన్నారు.