దయాగుణంతోనే దాతృత్వం వస్తుంది

– దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ-చర్ల
దయాగుణంతోనే దాతృత్వం వస్తుందని టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలో గల అరణ్య గ్రామమైన కిష్టారం పాడు ఆదివాసీ గ్రామంలో హైకోర్టు న్యాయవాది సిహెచ్‌ సతీష్‌ కుమార్‌ చేపట్టిన దుప్పట్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. శ్రీ చింతలచెరువు వెంకటాద్రి-సీవీకే రావు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుండి చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా అత్యంత మారుమూల అటవీ ప్రాంతమైన కిష్టారం పాడులో సుమారు 37 కుటుంబాలకు రూ.30 వేల వ్యయంతో తామర పత్ర గ్రహీత, స్వతంత్ర సమరయోధుడు చింతలచెరువు వెంకటాద్రి మనవడు, కళాతపస్వి విద్యావంతుడైన సివికే రావు తనయుడు హైకోర్టు న్యాయవాది సతీష్‌ కుమార్‌ తన దాతృత్వంతో దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయించారు. హైకోర్టు న్యాయవాదిగా హైదరాబాదులో ఉన్నప్పటికిని తను జన్మించిన చర్ల పై మక్కువతో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఎంపీ లాండ్స్‌ ద్వారా రోడ్లు వేయించడం, పాఠశాలలో కావాల్సిన ఫర్నిచర్‌, మరుగుదొడ్లు నిర్మించడం, నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించడం, మేజర్‌ గ్రామపంచాయతీలో అంతిమ రధం రావడానికి ఆయన వంతుగా ఎంతో కృషి చేసి కేవీపీ రామచంద్రరావు ఎంపీ లాండ్స్‌ నుండి మండలానికి అంకితం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ తన ప్రాంతీయ అభిమానాన్ని చాటుకుంటున్నారని సీనియర్‌ నాయకులు దొడ్డి తాతారావు, తడికల లాలయ్య కీర్తించారు. పేదరికంతో మగ్గిపోయే కుటుంబాలు అంటే లాయర్‌ సతీష్‌కి ఆది నుండి కూడా ఎంతో మక్కువ నిరుపేదలకు సహాయం చేయడం అంటే అమితానందమని చర్ల మేజర్‌ పంచాయతీ ఉప సర్పంచ్‌ శివ లక్ష్మీనారాయణ, 13వ వార్డు సభ్యులు దొడ్డి హరినాగవర్మలు ఆయనను కీర్తించారు. తాతా, తండ్రి వలె సొంత లాభం కొంత మానుకొని నిరుపేదలకు సాయం చేయడం లాయర్‌కి వెన్నతో పెట్టిన విద్య అని సీనియర్‌ పాత్రికేయులు కొనియాడారు. దుప్పట్లు పంపిణీ అనంతరం గ్రామస్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం గ్రామస్తులు ఎంతో ఆనందపడ్డారు. ఈ కార్యక్రమంలో తాటి రామకృష్ణ, జగన్నాథం, సిహెచ్‌ సాయి చరణ్‌, యువకులు చందు, భరత్‌, ఉంగయ్య గ్రామ పెద్దలు దేవయ్య, వీరయ్య, లక్ష్మణ్‌తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పురుషులు, చిన్నారులు పాల్గొన్నారు.