– ఇతర విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో సర్దుబాటు
– 2,555 మంది భవితకు భరోసా
– ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించిన యాజమాన్యాలు
– వారంలో ఉత్తర్వులు జారీ?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అనుమతి లేకుండానే అడ్మిషన్లు చేపట్టిన గురునానక్, శ్రీనిధి ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో గత విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఊరట లభించింది. వారిని ఇతర విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ రెండు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన 2,555 మంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా దక్కింది. ఇందుకు సంబంధించి వారంరోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశమున్నది. ఈ దిశగా ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తును పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రతిపాదనను గురునానక్, శ్రీనిధి ప్రయివేటు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు అంగీకరించాయి. 2022-23 విద్యాసంవత్సరంలో శ్రీనిధి విశ్వవిద్యాలయంలో 284 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వారిని ప్రస్తుత విద్యాసంవత్సరంలో బీటెక్ రెండో సంవత్సరంలో శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక మొదటి సంవత్సరం పరీక్షలను రాస్తారు. నాలుగేండ్లు పూర్తయ్యే నాటికి వారు ఇతర విద్యార్థులతోపాటు పరీక్షలకు హాజరవుతారు. అప్పటి వరకు వారి పరిస్థితిని బట్టి పరీక్షలను నిర్వహిస్తారు. ఇక గురునానక్ విశ్వవిద్యాలయంలో 2,893 మంది ప్రవేశం పొందారు. వారిలో 622 మంది విద్యార్థులు ఆ ప్రవేశాలను రద్దు చేసుకున్నారు. ఇక మిగిలిన 2,271 మంది విద్యార్థులను ఇతర వర్సిటీలు, కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఇందులో బీటెక్‌లో చేరిన 1,255 మందిని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో, బయోటెక్నాలజీ కోర్సులో చేరిన 160 మందిని జేఎన్టీయూ హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంగణంలో, బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో చేరిన 281 మందిని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో, బీఎస్సీ అగ్రికల్చర్‌లో చేరిన 75 మందిని అనురాగ్ విశ్వవిద్యాలయంలో, బీకాం, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరిన 480 మంది విద్యార్థులను ఓయూ విశ్వవిద్యాలయ క్యాంపస్ కాలేజీల్లో, ఎంబీఏలో చేరిన 20 మందిని గురునానక్ కాలేజీలో ప్రవేశాలను కల్పించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసమే నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాకుండానే శ్రీనిధి, గురునానక్ ప్రయివేటు విశ్వవిద్యాలయాలు 2022-23 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టాయి. శ్రీనిధిలో బీటెక్ ఇంజినీరింగ్ కోర్సులో 284 మంది, గురునానక్‌లో ఇంజినీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యాకోర్సుల్లో 2,893 మంది విద్యార్థులు చేరారు. అయితే వాటికి అనుమతి రాకపోవడంతో విద్యార్థుల బతుకులు రోడ్డున పడ్డాయి. వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. రూ.లక్షల ఫీజు, హాస్టల్ ఫీజు, రవాణా ఫీజు ఇలా విద్యార్థుల నుంచి భారీగానే వసూలు చేశాయి. అనుమతి వస్తుందంటూ యాజమాన్యాలు బుకాయించాయి. తీరా రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పలుమార్లు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద గురునానక్ ప్రయివేటు విశ్వవిద్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇప్పటి వరకు ఆ వర్సిటీలకు అనుమతి రాకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇతర విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో మహీంద్రా, మల్లారెడ్డి, వాక్సన్, అనురాగ్, ఎస్‌ఆర్ విద్యాసంస్థలు ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. వాటిలో మూడు విద్యాసంవత్సరాలుగా ప్రవేశాలు జరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ 13న రాష్ట్రంలో మరో ఐదు ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందులో శ్రీనిధి విశ్వవిద్యాలయం (ఘట్‌కేసర్), గురునానక్ విశ్వవిద్యాలయం (ఇబ్రహీంపట్నం), నిక్‌మర్ కన్‌స్ట్రక్షన్ విశ్వవిద్యాలయం (శామీర్‌పేట), ఎంఎన్‌ఆర్ విశ్వవిద్యాలయం (సంగారెడ్డి), కావేరి విశ్వవిద్యాలయం (గౌరారం) ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. కానీ ఆమె ఆమోదించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపారు. అయితే ఈనెల ఐదో తేదీన ఐదు ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందింది. దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపించింది. ఆమె దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని నిబంధనలు చెప్తున్నాయి.