నవతెలంగాణ-శంకర్‌పల్లి
పిల్లలపై జరిగే లైంగిక దాడులపై కాపాడుకోవటం ఎలా అనే అంశంపై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించినట్టు లెర్నింగ్ స్పేస్ ఫౌండర్ కౌముది అన్నారు. స్వచ్ఛంద సంస్థ పిల్లల భద్రతా వారోత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా బుధవారం లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ శంకర్‌పల్లి మండలంలోని 13 ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలపై జరిగే లైంగిక దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడం ఎలా అనే అంశాలపై వారికి క్లుప్తంగా వివరించినట్టు తెలిపారు. పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టం, ఇంటర్ నేట్‌తో పొంచి ఉన్న ప్రమాదాలు వంటి అంశాలపై పోస్టర్ల ద్వారా సుమారు 2000 మంది విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సేవా-ఆధారిత క్లబ్ చైతన్య స్పందనకు చెందిన 40 విద్యార్థులు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి బాలుర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదయశ్రీ సంధానకర్తగా వ్యవహరించారు. పిల్లలందరికీ పోషక విలువలు ఉన్న పల్లిపట్టీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.