అలుపెరుగని సాహిత్య కృషీవలుడు బాలసాహితీవేత్త ‘అమ్మన చంద్రారెడ్డి’

సహస్రవాణి, సహస్ర పద్య కంఠీరవ బిరుదులందుకున్న చంద్రారెడ్డి సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్‌ బాధ్యులుగా సాహిత్య సభలు, పురస్కారాల ప్రదానోత్సవాలు విశేషంగా నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు కూడా. మెదక్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా, నేషనల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ వారి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.
కవి, రచయిత, విద్యాధికారి, బాల సాహితీవేత్త సిద్ధిపేటకు చెందిన అమ్మన చంద్రారెడ్డి. శ్రీ చంద్రారెడ్డి సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని వల్లాపురంలో జనవరి 4, 1949 న పుట్టారు. శ్రీమతి వెంకవ్వ-శ్రీ నారాయణ రెడ్డి వీరి తల్లితండ్రులు. గణిత శాస్త్రంలో పట్టభద్రులైన వీరు తెలుగు సాహిత్యంలో ఎం.ఏ చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మండల విద్యాధికారిగా పని చేసి పదవీ విరమణ పొందారు. రచనా రంగంతో పాటు సామాజిక, ఉద్యోగ సేవా రంగాల్లో తలలో నాలుకలాగా ఉండే వీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘంలో వివిధ బాధ్యతలు చేపట్టి నిర్వహించారు. ముఖ్యంగా నిరాశ్రయులైన పిల్లల కోసం వీరి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమాలు ఎన్నదగినవి. మండల ఆహార సలహా సంఘ సభ్యులుగా, వినియోగదారుల సంఘం, సమాచార హక్కు ఫోరం వంటి అనేక సామాజిక సేవా సంస్థలతో కలిసి పనిచేశారు. సహస్రవాణి, సహస్ర పద్య కంఠీరవ బిరుదులందుకున్న చంద్రారెడ్డి సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్‌ బాధ్యులుగా సాహిత్య సభలు, పురస్కారాల ప్రదానోత్సవాలు విశేషంగా నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు కూడా. మెదక్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా, నేషనల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ వారి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. కవిగా రచయితగా రెండు పదుల సంఖ్యలో పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు అందుకున్నారు. పద్యం, గేయం, వచనం, నానీలు, బాల సాహిత్యం, కథలు రాసిన వీరు ‘చంద్రవేదం’ (రెండు భాగాలు), ‘సోమేశ్వర శతకం’, ‘వాణీ శతకం’ ప్రచురించారు. చంద్రవీక్షణం, తత్త్వదీపిక, సూక్తి చంద్రిక (నాలుగు భాగాలు), అంతరంగం, శ్రీ షిర్డీ సాయిబాబా పదాలు, చంద్రా లోకనం, చంద్ర కిరణాలు, సూక్తి పద్యాలు వంటివి వీరి పద్యకావ్యాలు, ఖండకావ్య సంపుటాలు. వచన కవిగా సూక్తులను కూర్చి వాటిని ‘జీవన సత్యాలు’గా ప్రచురించారు. ‘కవన వనం’ వీరి వచన కవితా సంపుటి. ఆచార్య ఎన్‌.గోపి కవితా రూప సృష్టి అయిన నానీలను సృజించి వాటిని ‘నేటి నిజాలు’ పేరుతో సంపుటంగా వెలువరించారు. రచయితగా తాను రాసిన భక్తి ఇత్యాది వ్యాసాలను ‘ఆధ్యాత్మిక వ్యాసాలు’గా తెచ్చారు. ‘వింతలోకం’ వీరి స్కెచ్‌ల సంపుటి. ‘కాల భైరవస్వామి చరిత్ర’ వీరి ఇతర వచన రచనలు. అమ్మన వ్యాసాలు కథలు రాశారు. దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో వీరి రచనలు అచ్చయ్యాయి. బాల సాహిత్యంలోనూ అమ్మన చంద్రారెడ్డిది విశేషకృషి, పరిశ్రమ. ఉపాధ్యాయునిగా పిల్లలతో నిరంతరం గడిపిన అనుభవం వారిని చక్కని రచనలు చేసే దిశగా నడిపించింది. అందుకు నిదర్శనం వీరి ‘భక్త రామదాసు’, ‘సురవరం ప్రతాపరెడ్డి’ ‘యుగంధరుడు’ వంటి పిల్లల కోసం రాసిన తెలంగాణ తేజోదీప్తుల జీవిత కథలు. బాలల కోసం కథలు, గేయాలు కూడా రాశారు అమ్మన చంద్రారెడ్డి. వాటిలో ‘బుడతలు’ కథా సంపుటి, ‘ఆట విడుగు’ బాలల గేయ సంపుటి ఉన్నాయి. ఉద్యోగం నుండి విశ్రాంతి పొందినా రచనా రంగంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న అమ్మన ఇప్పటికీ యువకులతో పాటీపడి రచనలు చేయడమే కాకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం వీరు రాసిన రామదాసు కథ బాలల స్థాయిలో వారికి అర్థమయ్యే భాషలో ఉండడం విశేషం. ముఖ్యంగా రామదాసు కీర్తనలవంటి వాటిని అమ్మన పిల్లలకు వివరించిన తీరు బాగుంటుంది. అదే కోవలో కాకతీయ సామ్రాజ్య మహామంత్రి యుగంధరుని కథను కూడా పిల్లలకు కాదు పెద్దలకూ నచ్చే విధంగా రాశారు. ‘తెలంగాణ వరం సురవరం’ కథను చిన్న పుస్తకంగా వెలువరించడం తన మట్టి రుణం తీర్చుకునే ప్రయత్నం. బాల సాహితీవేత్తగా వీరికి ఎక్కువ ఖ్యాతిని తెచ్చిన పుస్తకం ‘ఆట విడుపు’ బాల గేయ సంపుటి. ‘తనువునిండ గాయాలైనా/ తరువులు ఫలముల నిచ్చునురా/ చెడు గాలిని పీల్చుకుంటు/ మనుషుల ప్రాణాలు నిలుపునురా/ …వృక్షజాతి నశియింపగ/ కాలుష్యం కాటు వేయునురా/ ప్రతి ఒక్కరు మొక్కనాటి/ ప్రకృతి దృశ్యములు కాపాడరా’ అంటారు. పిల్లల క్రమశిక్షణ గురించి రాస్తూ ‘క్రమశిక్షణ పాటించి/ స్వయం శిక్షణ నేర్చుకో/ తోటి వారల ప్రేమించి/ దేశభక్తిని అలవరుచుకో’ అని రాస్తారు. హక్కుల సంఘంతో కలిసి పనిచేసిన అమ్మన అవి బాలలకు కూడా కావాలని, వాటిని కాపాడాలని రాస్తూ, ‘పిల్లల హక్కులను/ ఎల్లవేళలా కాపాడండి/ నేటి బాలలే రేపటి తరము/ హక్కులతో విధులు నేర్పండి’ అంటారు. సైన్సును చదువుకున్నారు కదా! ‘కాలుష్యం కోరలన్ని/ కఠినంగా చాచినాయి/ ‘ఓజోను’ పొరయంతయు/ చిరుగులమయ మగుచున్నది’ అని వాపోతారు. ‘ఓడిపోయినా దిగులెందుకురా/ ఓటమి విజయానికి నాందిరా/ జీవితమే ఒక పోరాటం/ జీవనమె ఒక ఆరాటం’ అంటూనే ‘… పట్టుదలయే పరమార్ధము’ అంటూ ఉద్భోదిస్తారు. ఇంకా బడి గురించి, చదువు గురించి ఎన్నో మంచి మంచి గేేయాలు రాశారు అమ్మన. వివిధ పురస్కారాలు పొందిన ‘శతకశ్రీ’ అమ్మన చంద్రారెడ్డి పద్య కవిత్యంలో చేసిన విశేష కృషికి తెలుగు విశ్వవిద్యాలయం వారిచే పద్య కవిత్వంలో కీర్తి పురస్కారంతో సత్కరింపబడ్డారు. జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548