– ప్రభుత్వం పట్టించుకోదా? : వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఊర్లు మునిగినా,ఇండ్లు కూలినా.. ఈ ప్రభుత్వానికి ప్రజల బాధ పట్టటం లేదని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనం వరదల్లో కొట్టుకుపోతున్నా..సీఎం బైటకి రావటం లేదని విమర్శించారు. వానలు వెలిశాక చుట్టం చూపుగా గాలిమోటార్లో తిరగటం ఆయనకు ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు. నష్టపరిహారమంటూ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పితే..వాస్తవంగా బాధితులను ఆదుకున్నది లేదని తెలిపారు. ఓట్ల కోసం డల్లాస్,ఇస్తాంబుల్, లండన్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పటం పరిపాటిగా మారిందని విమర్శించారు. వరదల్లో వరంగల్ మునక్కుండా మూడేండ్ల కింద మాస్టర్ ప్లాన్ అని చెప్పినా ఎందుకు ఫైల్ కదల్లేదని ప్రశ్నించారు. వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట అని చెప్పి, ఆ హామీని సైతం గోదాట్లోనే కలిపాడని విమర్శించారు. ఏడాదిగా గేట్లు మొరాయించినా కడెం ప్రాజెక్టును పట్టించుకోలేదని తెలిపారు. చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలనీ, కూలిన ఇండ్ల స్థానంలో పక్కా ఇండ్లు కట్టించాలని షర్మిల డిమాండ్ చేశారు.