నిర్మల్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల ఘర్షణ

నిర్మల్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల ఘర్షణ– రాళ్లు రువ్వుకొని, కర్రలతో దాడులు చేసుకున్న వైనం
– పోలీసుల ప్రవేశంతో సద్దుమణిగిన ఘటన
నవతెలంగాణ-నిర్మల్‌
నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌ కాలనీలో మంగళవారం బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కావడంతో ఉదయం బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విశ్వనాథ్‌పేట్‌, వైఎస్‌ఆర్‌ కాలనీలో ప్రచారానికి వెళ్లారు. అప్పటికే బీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడ ప్రచారం చేస్తూ ఎదురయ్యారు. దీంతో ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఇది ఇరుపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఘర్షణ ముదిరి రాళ్లు రువ్వుకొని, కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికెళ్లి వారిని చెదరగొట్టారు. కాలనీలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఓటమి భయంతోనే బీజేపీ ఈ దాడి చేసిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోపించారు. తమకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్‌ నాయకులు ఓ ప్రణాళిక ప్రకారం దాడులకు దిగారని బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రతి ఆరోపణలు చేశారు.