క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లను రెగ్యులరైజ్‌ చేయాలి

– విద్యాశాఖ ఉద్యోగ నోటిఫికేషన్‌ల్లో 30 శాతం వెయిటేజ్‌ కల్పించాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ – అడిక్‌ మెట్‌
క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీ)లను రెగ్యులరైజ్‌ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సమగ్ర శిక్షా క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్‌ యాదగిరి డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సమగ్ర శిక్షాలో విధులు నిర్వహిస్తున్న క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారు నిత్యం రవాణా చేయడానికి రవాణా చార్జీలు కూడా చెల్లించడం లేదని తెలిపారు. సమగ్ర శిక్షాలో విధులు నిర్వహిస్తున్న క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లను రెగ్యులేషన్‌ చేసి వారికి రవాణాచార్జీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ ఉద్యోగ నోటిఫికేషన్‌లో 30 శాతం వెయిటేజ్‌ కల్పించాలన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షల ఎక్స్ర్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ 18 నుంచి 25 పాఠశాలలను ప్రతి నెలా సందర్శిస్తున్నందుకు రవాణాచార్జీలు, ఫోన్‌ బిల్‌, నెట్‌ బిల్‌ రూపంలో నెలకు రూ. 5000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంపాదిత సెలవులు మినహా ఆరు నెలల ప్రసూతి సెలవులు, సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ అమలు చేయాలన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ.. తెలంగాణలో రెసిడెన్షియల్‌ పాఠశాలల సంఖ్య పెరిగింది కావున క్లస్టర్‌ల సంఖ్య పెంచాలన్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగుల సహదేవ్‌, కోశాధికారి రవీందర్‌, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కంచర్ల మహేందర్‌, కార్యదర్శులు జానకిరామ్‌, కంబాల సుధాకర్‌, ఉపాధ్యక్షులు చందు, పాషా, చంద్రశేఖర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.