అలసత్వం తగదు భారీవర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ హెచ్చరిక

– భద్రాచలంలో సహాయచర్యల కోసం హైదరాబాద్‌ కలెక్టర్‌కు బాధ్యతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారీ వర్షాల నేపథ్యంలో అలసత్వం తగదని,గతంలో వరదల సమయంలో సమర్థవంతంగా పని చేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్‌ కలెక్టర్‌గా పని చేస్తున్న దురిశెట్టి అనుదీప్‌ను తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బేరీజు వేసి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద నది ఉధతంగా ప్రవహిస్తున్నది. దీంతో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై సీఎం… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌ సహా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ అప్రమత్తంగా ఉంచాలంటూ సూచించారు. భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంతో పాటు కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసుల్లో కంట్రోల్‌ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను అందుబాటులో ఉంచాలని కోరారు. ఆయన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.