ఆకుపచ్చ తెలంగాణకు సీఎం కేసీఆర్‌ విశేష కృషి

– చైనా, బ్రెజిల్‌ దేశాలతో పోటిపడి తెలంగాణలో మొక్కల పెంపకం
– తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ తెలిపారు. మొక్కలు, చెట్లు ఉంటేనే మానవ ప్రగతి ముందుకు సాగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాచారంలోని తెలంగాణ ఫుడ్స్‌ ఫ్యాక్టరీలో హారితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కొలేటి దామోదర్‌ గుప్తాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచడంలో తెలంగాణ చైనా, బ్రెజిల్‌ దేశాలతో పోటి పడుతున్నదని తెలిపారు. చైనా 500 కోట్ల మొక్కలు, బ్రెజిల్‌ 300 కోట్ల మొక్కలు నాటితే, రాష్ట్రంలో ఇప్పటి వరకు 250 కోట్ల మొక్కలు నాటినట్టు వివరించారు. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రూపొందించిన ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ 2021 ప్రకారం రాష్ట్రంలో 632 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగిందని తెలిపారు.
దామోదర్‌ గుప్తా మాట్లాడుతూ అడవులు క్షీణిస్తున్న దేశంలో మొక్కల పెంపకానికి సీఎం కేసీఆర్‌ నడుం కట్టారని సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. రాష్ట్రంలో ఇప్పటికే అటవీ విస్తీర్ణం 28 శాతానికి చేరిందనీ, మరో 5 శాతం పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డబుల్‌ ఇంజిన్‌ రాష్ట్రాల్లో చెట్లు తరిగిపోతున్నాయని విమర్శించారు. అనంతరం వారిద్దరూ కలిసి ఫ్యాక్టరీని పరిశీలించారు. బాలామతం, ఇతర పౌష్టికాహారం తయారయ్యే విధానం, వాటి వల్ల కలిగే లాభాలను దామోదర్‌ గుప్తాకు రాజీవ్‌ సాగర్‌ వివరించారు.